జగన్ హామీలపై చంద్రబాబులో ఆందోళన

First Published Nov 22, 2017, 11:42 AM IST
Highlights
  • వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలతో చంద్రబాబునాయుడులో ఆందోళన మొదలైనట్లే ఉంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీలతో చంద్రబాబునాయుడులో ఆందోళన కనబడుతోంది. మామూలుగా సంక్షేమం విషయంలో చంద్రబాబు కాస్త కటువుగానే ఉంటారు. అవసరమనో లేకపోతే తప్పదనో అనుకుంటే తప్ప సంక్షేమం గురించి ఆలోచించరనే ఆరోపణలున్నాయి. అయితే, సంక్షేమరంగానికి సంబంధించిన పెన్షన్లంటారా అవి చంద్రబాబుతో సంబంధం లేనివి. కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించేదేమీ ఉండదు. అటువంటిది చంద్రబాబు మత్స్యకారులకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానంటే ఏమనర్ధం?

మంగళవారం ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, మత్య్సకారులందరకీ 50 ఏళ్ళకే పింఛను సౌకర్యం కల్పిస్తానని ప్రకటించారు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మత్య్సకారుల దినోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ, సముద్రాన్ని నమ్ముకుని అక్కడే జీవన పోరాటం సాగించే మత్స్యకారుల వల్ల జీడిపిలో 1.1 శాతం ఆదాయం వస్తోందని తెలిపారు. అదే సందర్భంలో మత్స్యకారుల బడ్జెట్ ను రూ. 187 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కూడా చెప్పారు.

ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లలో వృద్ధాప్య, వితంతు, వికాలంగ పింఛన్లున్నాయ్. ఈ పింఛన్ల మొత్తంలో అధికభాగం కేంద్రప్రభుత్వ నిదులే. వృద్దాప్య పింఛన్లైనా, వికాలాంగ, వితంతు పింఛన్లయినా కులం, మతంతో సంబంధం లేకుండా అర్హులైన వారికి ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అటువంటిది ఇంత హటాత్తుగా చంద్రబాబుకు మత్స్యకారుల పింఛన్ వయస్సును 50 ఏళ్ళకే తగ్గించాలని ఎందుకు అనిపించింది?

అంటే, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వివిధ సామాజికవర్గాలకు జగన్ అనేక హామీలు ఇస్తున్నారు. పింఛన్ల హామీకూడా అందులో ఒకటి. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు పింఛన్ వయోపరిమితిని 45 ఏళ్ళకే తగ్గిస్తానని ప్రకటించారు. దాంతో టిడిపిలో ఆందోళన మొదలైనట్లే కనబడుతోంది. ఎందుకంటే, రాబోయేదంతా ఎన్నికల కాలమే. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలైనా, ఇపుడు జగన్ చేస్తున్న హామీలైనా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్న విషయంలో అనుమానం లేదు.

ఎప్పుడైతే పింఛన్ల హామీని జగన్ ప్రకటించారో అప్పటి నుండే అధికారపార్టీలో ఆందోళన మొదలైంది. అయితే, వెంటనే తాము కూడా ఏదో ఓ ప్రకటన చేస్తే కాపీ కొట్టారంటారని కొద్ది రోజులు ఆగారు. మత్య్సకారుల దినోత్సవం పేరుతో ఓ కార్యక్రమం పెట్టి పింఛన్ల వయస్సును తగ్గిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

click me!