
హత్యా రాజకీయాలకు టిడిపి వ్యతిరేకమట. చంద్రబాబు తాజాగా చెబుతున్న మాట. పోలవరం ప్రాజెక్టులో పురోగతిని పరిశీలించేందుకు ఈరోజు పోలవరం వచ్చినపుడు మాట్లాడారు. నిన్ననే హత్యకు గురైన పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణరెడ్డి ఎలా మరణించారంటే మాత్రం చంద్రబాబు వద్ద సమాధానం లేదు. ఒకవైపేమో మృతుడి కుటుంబసభ్యులు నారాయణరెడ్డిని ఉప ముఖ్యమంత్రి కెఇ కుటుంబసభ్యులే హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. కంటికి కనిపిస్తున్న ఆధారాలు కూడా నారాయణరెడ్డిని ప్రత్యర్ధులే హత్య చేయించాయరని చెబుతున్నాయి.
ఇటువంటి పరిస్ధితుల్లో టిడిపి హత్యా రాజకీయాలను వ్యతిరేకమని చంద్రబాబు, జరిగిన హత్యకు తమకు ఎటువంటి సంబంధమూ లేదని కెఇ కృష్ణమూర్తి చెబితే ఎవరైనా నమ్ముతారా? ఆదివారం ఉదయం హత్య జరిగితే సోమవారం మధ్యాహ్నం వరకూ జిల్లాలోని తెలుగుదేశం నేతలెవరూ నోరు కూడా విప్పకపోవటం గమానార్హం.
హత్య జరిగిన వెంటనే కెఇ కుటుంబసభ్యులపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సంబంధం లేదని చెప్పటానికి కెఇకి 24 గంటలు ఎందుకు పట్టింది? అసలు హత్య జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి రావటానికి ఐదు గంటలు ఎందుకు పట్టింది?
గడచిన మూడేళ్ళల్లో ఒక్క కర్నూలూ జిల్లాలోనే 430 మందికి పైగా హతమయ్యారని మీడియా సమాచారం. అంటే ఒక్క జిల్లాలోనే అన్ని వందల మంది హత్యకు గురైతే మిగిలిన 12 జిల్లాలో ఇంకెంతమంది పోయారో? హత్యా రాజకీయాలకు టిడిపి దూరం అంటే ఇదేనా? పైగా వైఎస్ రాజారెడ్డి, జగనే ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రత్సహించారంటూ చంద్రబాబు చెప్పటం విచిత్రంగా ఉంది.
టిడిపికి సంబంధం లేదని చెప్పటం వరకూ ఓకే. అయితే, రాజారెడ్డి, జగన్ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏంటో చంద్రబాబుకే తెలియాలి? జగన్ ఆరోపణలకు సమాధానాలు చెప్పుకోలేక చంద్రబాబు కూడా జగన్ పై ఎదురుదాడి చేస్తున్నట్లున్నారు చూడబోతే.