ప్రత్యర్ధి పార్టీలు బ్రతకకూడదా?

First Published Apr 7, 2017, 2:57 AM IST
Highlights

టిడిపికి ఓట్లేసిన ప్రజలే ప్రతిపక్షానికి కూడా ఓట్లేసారన్న సంగతి చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తానికి తాను ముఖ్యమంత్రన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

ప్రత్యర్ధి పార్టీలు రాష్ట్రంలో బ్రతకకూడదా? చంద్రబాబునాయడు వరస చూస్తుంటే నిజమేననిపిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో సిఎం మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా ఇచ్చే చిన్న చిన్న పనులు కూడా ప్రత్యర్ధిపార్టీ వారికి పోకుండా చూసుకోవాలని స్పష్టంగా చెప్పారు. అంటే, అర్ధమేమిటి? ప్రత్యర్ధి పార్టీకి ఓట్లేసిన ప్రజలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన లబ్ది అందకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశ్యమా? ప్రభుత్వ పథకాలు అందాల్సింది రాజకీయపార్టీలకు కాదు, ప్రజలకు. టిడిపికి ఓట్లేసిన ప్రజలే ప్రతిపక్షానికి కూడా ఓట్లేసారన్న సంగతి చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఎన్నికల వరకే ప్రత్యర్ధులు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తానికి తాను ముఖ్యమంత్రన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

ఇప్పటికే ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు, లబ్దిదారుల ఎంపిక మొత్తం అధికార పార్టీ కనుసన్నల్లోనే సాగుతోందన్నది వాస్తవం. గ్రామాల్లో లబ్దిదారుల ఎంపిక జన్మభూమి కమిటిల ద్వారానే సాగుతోంది. విచిత్రమేమిటంటే లబ్దిదారుల ఎంపిక కోసం టిడిపిలోని వర్గాల మధ్య ఆధిపత్య పోరాటాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్ధితుల్లో మళ్ళీ ప్రత్యేకంగా చంద్రబాబు ప్రత్యర్ధిపార్టీకి చిన్న పని కూడా జరగకూడదని చెప్పటమేమిటో? ప్రభుత్వంలో పనులు కావాలన్నా, పథకాలు అందాలన్నా టిడిపిలో చేరితేనే అందుతాయని అధికారపార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా?

ఇక మంత్రివర్గంలోని ప్రతీ ఒక్కరిని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిగా చంద్రబాబు నియమించారు. వారి పరిధిలో ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్ వార్డు, డివిజన్ల ఉప ఎన్నికల్లో కూడా గెలవాల్సిందేనని చెప్పటం చంద్రబాబులోని అభద్రతను సూచిస్తోంది. అసలు మున్సిపాలిటీల్లోని వార్డు, డివిజన్ల ఉప ఎన్నికల గురించి కూడా చంద్రబాబు పట్టించుకుంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎక్కడ కూడా ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాకూడదన్నదే అసలు రహస్యం.

అసెంబ్లీ, పార్లమెంట్ వంటి ప్రత్యక్షంగా ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తోందని చెప్పారు. అసలు, గడచిన మూడేళ్ళల్లో ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానానికి ఎన్నిక జరగనే లేదు. పట్టభద్రుల ఎంఎల్సీ నియోజకవర్గాల్లో మాత్రం గెలవలేకపోతుందని చంద్రబాబు చెప్పటం మాత్రం వాస్తవం. ఎందుకంటే, మూడు స్ధానిక సంస్ధలకు జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమో అధికార పార్టీ ఓట్లేయించుకున్నది. ప్రజలు నేరుగా ఓట్లేసిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్సీ నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి ఓడిపోయింది. అంటే ఇక్కడ ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. ప్రజా వ్యతిరేకత మొదలైన తర్వాత మంత్రులకు బాధ్యతలు అప్పగించినంత మాత్రాన ఏమిటి ఉపయోగం?

click me!