
వివాదాస్పద ప్రకటనలతో చంద్రబాబునాయుడును టిడిపిని ఇరుకునబెట్టే ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరోసారి తనదైన స్టైల్లో రెచ్చిపోయారు. తాజాగా చంద్రబాబు గాలి తీసేసారు. సిఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరంపై జెసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. అదేవిధంగా చంద్రబాబును ఇబ్బంది పెడుదున్న ఫిరాయింపుల వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. మొత్తం మీద సెన్సిటివ్ వ్యవహారాలపై అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపి కుండబద్దలు కొట్టారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వటానికి మరో నాలుగేళ్ళు పడుతుందట. మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావులు 2018 కల్లా పూర్తిచేస్తామని ఒకసారి. కాదు కాదు 2019లోగా పూర్తిచేస్తామని మరోసారి ఇప్పటికి చాలాసార్లే చెప్పారు. మరి, ఇపుడు సాక్ష్యాత్తు అధికారపార్టీ ఎంపి ఏమో పోలవరం పూర్తవ్వాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని చెప్పటం విశేషం. రెండేళ్ళల్లో ప్రాజెక్టును పూర్తి చేయటం ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని కూడా ఎంపి తేల్చేసారు. మరి, చంద్రబాబు, దేవినేని ఎంపి మాటలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
అలాగే, ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ, ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రి పదవులు ఇవ్వటంలో తప్పేమీ లేదన్నారు. కాలం మారిపోయిందని, ఇపుడిదంతా మామూలేనని చాలా లైట్ తీసుకున్నారు.