
‘అంతా వారి తలరాత’. ‘ఒక్కోసారి దురదృష్టం వల్ల కూడా అలా జరుగుతుంది’. ఇది ఏర్పేడు ఘటనపై రెండు రోజుల తర్వాత చంద్రబాబునాయుడు ప్రతిస్పందన. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏర్పేడులో లారీ ప్రమాదం వల్ల 15 మంది మృతిచెందిన విషయమై స్పందించారు. నిజమే చంద్రన్న పాలనను కూడా అందరూ తలరాతనే సరిపెట్టుకుంటున్నారు. జరిగే ప్రతిదీ తలరాతే అనుసుకుంటే ఇక ముఖ్యమంత్రి, ప్రభుత్వం, యంత్రాంగం అవన్నీ ఎందుకు? వారి జీత బత్యాల ఖర్చు అంతా దండగ కదా?
శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఇప్పటివి కావు. టిడిపి హయాంలో తవ్వకాలు బాగా ఎక్కువయ్యాయి. అక్రమ పద్దతిలో పలువురు నేతలు కోట్లు గడించారన్న ఆరోపణలు ఎప్పటి నుండో వినబడుతున్నాయి. శ్రీకాళహస్తిలో ప్రత్యేకించి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపైనే ఆరోపణలున్నాయి. మంత్రి కనుసన్నల్లోనే తవ్వకాలు జరిగుతున్నాయని బాధిత కుంటుంబాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి. ఇదే విషయమై స్ధానికులు ఎన్నోసార్లు ఎంఆర్ఓ, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా ఫలితం కనబడ లేదు. గ్రామస్తులే ఇసుక తవ్వకాలను అడ్డుకుందామనుకుంటే వారిపై దాడులు జరిగాయి. తవ్వకాలు మొత్తం టిడిపి నేతలు ధనుంజయనాయుడు, చిరంజీవి నాయుడు ఆధ్వర్యంలోనే జరుగుతున్న విషయం కూడా బహిరంగ రహస్యమే. అయినా ఎవరిపైనా ఎటువంటి చర్యలు లేవు.
ఈ విషయాలు మొత్తం చంద్రబాబు దృష్టిలో కూడా ఉన్నాయి. అయినా ఫలితం కనబడలేదు. చివరకు లారీ ప్రమాదంలో 15 మంది మరణించిన తర్వాత ‘ప్రమాదంలో మరణించటమన్నది వారి తలరాత’ అంటూ తీరిగ్గా సిఎం ఇపుడు స్పందించటం విచిత్రంగా ఉంది. ప్రమాదం జరగటం, మరణించటమన్నది వారి తలరాతే అయినపుడు ఘటనపై విచారణ మాత్రం ఎందుకు? బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటనలెందుకు? వారిద్దరినీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనొకటి. నిజంగా వారిద్దరికీ చంద్రబాబు ఎంత పెద్ద శిక్ష వేసారో. పైగా బాధ్యులను 20 ఏళ్ళు బొక్కలో తోస్తే మిగిలిన వారు దారికి వస్తారని వ్యాఖ్య ఒకటి. బాధ్యులను జైల్లో పడేస్తే చనిపోయిన వారు తిరిగి వస్తారా? ఎంత నష్టపరిహారం ఇస్తే మాత్రం బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయగలదా?
పైగా అవసరమైతే వెహికల్ చట్టాన్ని సవరిస్తారట. పిడి యాక్ట్ పెడతారట. అవసరమైతే ఇసుకను నిత్యావసర వస్తువుగా ప్రకటిస్తారట. అక్రమాలకు పాల్పడితే ఎంత గొప్పవారైనా చర్యలు తీసుకుంటారట. అన్నీ...అటలే. గడచిన మూడేళ్ళుగా బాధ్యులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదో సిఎం ముందు సమాధానం చెప్పాలి. ఫిర్యాదులు వచ్చినపుడే బాధ్యులపై చర్యలు తీసుకునుంటే ఇపుడు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదేమో. ఒకవేళ జరిగినా అప్పుడు తలరాత అని మాట్లాడినా చెల్లుబాటవుతుంది.