
చంద్రబాబునాయుడుకు మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో ఊహించని షాక్ ఎదురైంది. అదీ ఓ విద్యార్ధిని రూపంలో. విజయవాడలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే కదా. సదస్సు ప్రధాన ఉద్దేశ్యం సమస్యలపై మహిళలు భయపడకుండా ధైర్యంగా ప్రశ్నించాలని చెప్పటమే. అదే విషయాన్ని చంద్రబాబు తన ప్రారంభోపన్యాసంలో కూడా వినిపించారు. అయితే తాను చెప్పింన మాటే తనకు చుట్టుకుంటుందని పాపం ఏమాత్రం ఊహించలేదు చంద్రబాబు.
నిండు సభలో ఓ విద్యార్ధిని తనను నిలదీసేటప్పటికీ ఏం చెప్పాలో చంద్రబాబుకు అర్ధం కాలేదు. సదస్సు ప్రారంభమైన సాయంత్రం 9 అంశాలపై బృందచర్చలు జరిగాయి. వందలాదిమంది విద్యార్ధినులు, మహాళలు తలా ఓ బృందంగా ఏర్పడి సమస్యలపై చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ప్రాంగణంలోకి వచ్చిన చంద్రబాబు చర్చలు జరుగుతున్న తీరును పరిశీలిస్తూ ఓ బృందం వద్దకు వచ్చారు.
అప్పటికే ‘హామీలు-ఆచరణ’ అనే అంశంపై ఆ బృందం మధ్య చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు వచ్చిన విషయాన్ని గమనించిన కర్నూలుకు చెందిన ఓ విద్యార్ధిని మాట్లాడుతూ, తమ గ్రామంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న సమస్యలను ఏకరవుపెట్టారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చకపోవటంతో తామంతా ఇబ్బందులు పడుతున్న’ట్లు చంద్రబాబును నిలదీసారు. ‘ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నా అవేవీ తమ వద్దకు రావటం లేద’ని గట్టిగా చెప్పారు. ఊహించని పరిణామంతో చంద్రబాబు ఖంగుతిన్నారు.
అయితే, వెంటనే తేరుకున్న చంద్రబాబు తనదైన శైలిలో మాట్లాడుతూ, మహిళల సాధికారతకు దేశంలోనే తొలిసారిగా ఓ సదస్సును ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్ధినులు, మహిళలు తమ సమస్యలపై గట్టిగా ప్రశ్నించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతలోనే విద్యార్ధిని తన ప్రశ్నను గుర్తుచేయగా ‘ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఇది తగిన వేదిక కాదం’టూ అక్కడి నుండి వెళ్లిపోయారు.ల