
తన వైఫల్యాలకు రాష్ట్ర విభజననే ఆయింట్మెంట్లాగ పూయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. లేకపోతే, రాష్ట్ర విభజన అయిన రెండున్నరేళ్ళ తర్వాత కూడా ఇంకా అదే గొడవెందుకు? అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు అలానే ఉన్నాయి. అసలు విభజన వల్లే కదా చంద్రబాబు సిఎం అయింది. ఎన్నికల్లో కాలం కలసివచ్చి సిఎం అయిన తర్వాత కూడా విభజననే పట్టుకుని పాకులాడాల్సిన అవసరం లేదు. మరెందుకు ప్రస్తావిస్తున్నట్లు? అంటే, తన వైఫల్యాలపై ప్రజలు మాట్లాడుకోకూడదన్నదే కారణంగా కనబడుతోంది.
పోయిన ఎన్నికల్లో సిఎం అవటమే లక్ష్యంగా ఆచరణసాధ్యం కాని హామీలెన్నింటినో చంద్రబాబు ఇచ్చారు. చంద్రన్న ఇచ్చిన హామీల్లో ప్రత్యేకహోదా సాధన, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్, రుణమాఫీలు, నిరుద్యోగ భృతి, రాజధాని నిర్మాణం, ఇంటికో ఉద్యోగం, కాపులను బిసిల్లోకి చేర్చటం లాంటివి అనేకమున్నాయి. ప్రస్తుతం వాటిపై జనాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పైగా హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారంటూ జగన్మోహన్ రెడ్డి నిత్యమూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దాంతో టిడిపికి ఇబ్బందిగా మారింది.
ఈ ఏడాది గడిస్తే ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కిపోతుంది. అందుకనే తానిచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనబడుతోంది. అందుకనే ప్రతీరోజు రాష్ట్ర విభజననే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అంటే, తన వైఫల్యాలకూ రాష్ట్ర విభజనే కారణమని చెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.
చంద్రబాబు సిఎం అయిన తర్వాత ఇంత వరకూ చెప్పుకోదగ్గ పెట్టుబడులు రాలేదు. కేంద్రసాయం కూడా అంతంతమాత్రమే. పైగా ప్రత్యేకహోదా సాధనలో విఫలమయ్యారు. తానే డిమాండ్ చేస్తున్న ప్రత్యేకప్యాకేజీకి కూడా చట్టబద్దతను సాధించలేకపోయారు. రాజధాని నిర్మాణానికి డిజైన్లే ఖరారు కాలేదు. నిరుద్యోగ భృతిలేదు. ఇంటికో ఉద్యోగం ఏమైందో తెలీదు. రుణమాఫీలు ఎంతవరకూ అయ్యిందో ఎవరూ చెప్పలేకున్నారు. దీనికి అదనంగా పెరిగిపోయిన అవినీతి, పార్టీ నేతల దాష్టికాలు, అదుపుతప్పిన శాంతి,భద్రతలు, మహిళలపై పెరిగిపోయిన అత్యాచారాలు. ఈ వైఫల్యాలన్నీ చంద్రబాబు ఖాతాలో జమవుతున్నాయి. దాంతో ప్రజల దృష్టి మళ్ళిద్దామని అనుకుంటున్నట్లు కనబడుతోంది. అందుకనే ప్రతి రోజు రాష్ట్ర విభజననే ప్రస్తావిస్తున్నారు.