
నంద్యాల ఉపఎన్నిక ఎఫెక్ట్ చంద్రబాబుపై బాగా పనిచేస్తోంది. తప్పని పరిస్ధితుల్లోనే రెండు ఎంఎల్సీ పదవులనూ రాయలసీమకే చంద్రబాబు కేటాయించారు. మామూలుగా అనేక సమీకరణలను చూసే చంద్రబాబు ఇప్పుడు మాత్రం కేవలం అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్లు స్పష్టమైపోతోంది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్ధానాల విషయమై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి క్యాబినెట్ లో చర్చించి గవర్నర్ కు సిఫారసు చేయాలని నిర్ణయించారు.
నంద్యాల ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని రెండు స్ధానాల్లో ఒకటి కర్నూలు జిల్లాలోని నంద్యాలకే చెందిన మాజీమంత్రి ఎన్ఎండి ఫరూఖ్, రెండో స్ధానాన్ని కడప జిల్లాలోని మాజీమంత్రి రామసుబ్బారెడ్డికి కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రెడ్డి విషయంలో పెద్ద కసరత్తే చేసారు చంద్రబాబు. జిల్లాలోని బలమైన వర్గం ఉన్న నేతల్లో రెడ్డి కూడా ఒకరు. అయితే, వైసీపీ ఎంఎల్ఏ ఆది నారాయణరెడ్డి టిడిపిలో చేరిన దగ్గర నుండి సమస్యలు మొదలయ్యాయి. దాంతో ఎప్పుడైనా రెడ్డి టిడిపికి రాజీనామా చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు రెడ్డిని ఎప్పటి నుండో బుజ్జగిస్తూ వస్తున్నారు. అందుకు ఎంఎల్సీ పదవిని ఎరగవేసారు.
అయితే, హటాత్తుగా నంద్యాల ఉపఎన్నిక వచ్చింది. నంద్యాలలో గెలుపు కోసం అవస్తలు పడుతున్న చంద్రబాబు అక్కడి ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఓ సీటను ఫరూక్ కు కేటాయిస్తున్నట్ల ప్రకటించారు. ఎప్పుడైతే ఒక సీటు ఫరూఖ్ కు ఖాయమైందో రెడ్డికిచ్చిన హామీ గంగలో కలుస్తుందన్న ప్రచారం పార్టీలో మొదలైంది. ఎందుకంటే, ఇద్దరూ రాయలసీమకు చెందిన నేతలే కాబట్టి రెండింటినీ ఒకే ప్రాంతంకు ఇవ్వటం సాధ్యంకాదని కూడా అనుకున్నారు.
సమీకరణల రీత్యా రెడ్డికి మొండిచేయి తప్పదనే అందరూ అనుకున్నారు. దాంతో రెడ్డిలో అసంతృప్తి మొదలై వైసీపీ కీలక నేతలతో మంతనాలు కూడా మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చిందో వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఎంఎల్సీలు భర్తీ చేయకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించి అవసరార్ధం రెండు స్ధానాలను ఫరూఖ్, రామసుబ్బారెడ్డితో భర్త చేయాలని క్యాబినెట్లో తీర్మానం చేసారు.