
ముఖ్యమంత్రి చందబాబు నాయుడికి నిన్న నార్మన్ పోస్టర్ సమర్పించిన అమరావతి పాలనా నగర భవనాలు డిజైన్లు అంతగా నచ్చలేదు. అందువల్ల వీటిని ఖరారుచేయడం మరింత ఆలస్యం కానుంది. ఈ భవనాలు పైకి అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన లండన్ డిజైనర్లకి స్పష్టంచేశారు.
‘‘ఇప్పుడు అందించిన ఆకృతుల్లో కొన్ని ఎలిమెంట్స్ బావున్నాయి., బాహ్య రూపం అంత గొప్పగా రాలేదు,’ అని నార్మన్ ఫోస్టర్ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక మంత్రి నారాయణలతో కలిసి ఫోస్టర్ బృందం అందించిన ఆకృతులను ముఖ్యమంత్రి ఈ రోజు మరొక సారి నిశితంగా పరిశీలించారు. ఈ ఆకృతులపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు ఫోస్టర్ బృందానికి ఆయన తెలియచేశారు. మరింత సమయం తీసుకుని అత్యద్భుతమైన డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు.
ప్రపంచంలోని తొలి 10 అత్యుత్తమ భవంతుల నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని వాటికి తలదన్నే రీతిలో ఆకృతులు తయారుచేయాలని ఆయన అన్నారు.సీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఆర్కిటెక్టులు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్టులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి డిజైన్ల రూపకల్పనలో ఫోస్టర్ బృందానికి సహకరించాలనికూడా ఆయన సూచించారు.
తెలుగు చలనచిత్ర రంగ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో వెంటనే సంప్రదింపులు జరపాలని కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అవసరమైతే తన బృందంతో సహా రాజమౌళిని లండన్ పంపించి ఆకృతుల తయారీలో ఫోస్టర్ సంస్థకు తగు సూచనలు, సలహాలు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అక్టోబరు 25న తాను స్వయంగా లండన్ వెళ్లి ఫోస్టర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ వారు రూపొందించే ఆకృతులను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే నెలలో యుఎస్, యుఏఈ పర్యటనతో పాటు యూకే వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆకృతుల తయారీలో పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించాలని, అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శించాలని ఆయన సూచించారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రకటించింది.