
ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ సిద్ధమైపోతోంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చన్న ఉద్దేశ్యంతో ఇప్పటి నుండే గట్టి అభ్యర్ధుల వేటలో పడ్డారు చంద్రబాబునాయుడు. అందుకనే ముందుగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను పెట్టి పెద్ద భారాన్నే మోపారు. 25 పార్లమెంట్ నియోజకర్గాలను యూనిట్ గా తీసుకుని ఒక్కో మంత్రికి ఒక్కో నియోజకవర్గాన్ని అప్పజెప్పారు. గతంలో జిల్లాను యూనిట్ గా తీసుకునే వారు. అయితే, ఇపుడు ఉన్న జిల్లాలే 13 కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గాలను యూనిట్ గా తీసుకున్నారు. 23 మంది రాష్ట్రమంత్రులకు, ఇద్దరు కేంద్రమంత్రులకు పూర్తిస్ధాయిలో బాధ్యతలు అప్పగించటంతో లక్ష్యాలను నిర్దేశించటం గమనార్హం. త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా గట్టి అభ్యర్ధులను వెతికే పనిని అప్పగించినట్లు సమాచారం.
పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిపించటంతో పాటు వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించాల్సిన బాధ్యత కూడా మంత్రులపైనే పెట్టారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా ఐటి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ ను నియమించటం గమనార్హం. విజయవాడ స్ధానం నుండి నారా బ్రాహ్మణి పోటీ చేస్తుందన్న ప్రచారం నేపధ్యంలో లోకేష్ కు బాధ్యతలు అప్పగించటం విశేషం. మంత్రుల్లో ఒక్క ఆదినారాయణరెడ్డికి మాత్రమే సొంత జిల్లాలోని నియోజకవర్గాన్ని అప్పగించారు. కడప జిల్లాకు చెందిన ఆదికి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని అప్పగించారు.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ కోద్ది రోజులుగా చంద్రబాబు పార్టీ నేతలకు సంకేతాలు పంపుతున్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం, అంతుకుముందు జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కదా? మెల్లిమెల్లిగా అవసరమైన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించనున్నారు. సరిగ్గా పనిచేయని ఇన్ ఛార్జిలను తొలగించి వారి స్ధానంలో మరొకరిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. అదే విధంగా ఇపుడు నియమించే ఇన్ ఛార్జిలే దాదాపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులయ్యే అవకాశాలుండటంతో నేతల మధ్య పోటీ మొదలైంది.