
త్వరలో జరుగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబునాయుడు మంత్రులకు గట్టి క్లాసేపీకారు. చంద్రబాబు వరుస చూస్తుంటే ఏదో అనుమానాలే వస్తున్నాయి. తాను తప్ప మంత్రులెవరూ పనిచేయటం లేదనిమండిపడ్డారు. ఇంతకాలం ఈ రాష్ట్రానికి తానొక సిఇఓ అన్నట్లుండేవారు. కాబట్టే వాళ్ళు కూడా తాము మంత్రులమన్న సంగతి మరచినట్లున్నారు. మంత్రులందరూ తాము అధికారులమన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ సిఎం గుస్స అయ్యారు. మంత్రుల తీరు బాగోలేదని ఇప్పుడే తెలిసిందా చంద్రబాబుకు? మంత్రుల్లో చాలామంది తమకు అందుబాటులో ఉండట లేదంటూ పలువురు నేతలు ముఖ్యమంత్రికి ఎప్పటి నుండో ఫిర్యాదులు చేస్తున్నాఎందుకు పట్టించుకోలేదు?
ఇక మంత్రుల ఆదేశాలను వారి సిబ్బందే పట్టించుకోవటం లేదన్నారు. ఎలా పట్టించుకుంటారు? ప్రతీ శాఖలోనూ తాను, తన తనయుడు లోకేష్ జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినలేదా? క్రిందస్ధాయిలోని రెవిన్యూ ఇనస్పెక్టర్లతో సైతం చంద్రబాబే టెలికాన్ఫరెన్స్ లో గంటల తరబడి మట్లాడి ఆదేశాలిస్తుంటే ఇక వారు మంత్రుల మాటను ఎందుకు లెక్క చేస్తారు? పార్టీ, ప్రభుత్వం గురించి తానొక్కడే పట్టించుకోవాలా? తానొక్కడే భుజాన మోయాలా అంటూ ప్రశ్నించటం విచిత్రంగా ఉంది. తాను తప్ప ఇంకెవరూ పనిచేయటం లేదని అనిపించుకోవటమే కదా చంద్రబాబుకు కావాల్సింది. అందుకనే మిగిలిన వారెవరూ పట్టించుకోవటం లేదు.
ఎన్నికల్లో తానొక్కడే గెలిస్తే సరిపోదని, మంత్రులను గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని కొత్త విషయాన్ని చెప్పారు. మంత్రులను చంద్రబాబు గెలిపించటమేమిటి? ఎవరికి సత్తా ఉంటే వారు గెలుస్తారు. గతంలో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు ఎంతమంది మంత్రులను గెలిపించారు? ప్రజల్లో ఓట్లడగాలంటే మంత్రులందరూ ప్రజల్లో తిరాగాల్సిందేనని క్లాసు పీకటం గమనార్హం. ప్రతీ ఎన్నికా ప్రతిష్టాత్మకంగా భావించాల్సిందేనట. ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ ప్రతిష్టకు విశ్వాసంగా నిలుస్తాయన్నారు. ఏ ఎన్నికనూ తక్కువగా చూడకూడదని చెప్పారు.గ్రాడ్యుయేట్, టీచర్, కార్మిక సంఘాల ఎన్నికల్ని టిడిపి పట్టించుకోవటం లేదన్న భావన వీడాలన్నారు. స్ధానిక ఎన్నికల్ని పట్టించుకోకుండా పదవులు, టిక్కెట్లు కావాలంటే కుదరదని గట్టిగా హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే, రేపు మార్చిలో జరుగనున్న స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమైనా తేడా వచ్చే అవకాశాలున్నాయని చంద్రబాబు అనుమానిస్తున్నారా?