
చంద్రబాబునాయడుకు గురివింద సామెత బాగా సరిపోతుంది. తనలో తప్పులను దాచిపెట్టుకుని ఎదుటి వారిలో తప్పులను ఎత్తిచూపటంలో చంద్రబాబు మహా ఘటికుడు. సోమవారం ముగిసిన మహానాడులో అదేపని చేసారు.
మహానాడులో అవినీతి గురించి మాట్లాడుతూ నాయకులైనా, వ్యాపారులైనా అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాధనాన్ని దిగమింగిన వారి నుండి ఆ సొమ్మంతా రికవరీ చేయాలని డిమాండ్ చేసారు. చార్జిషీట్లలో ఉన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. మోడి ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా చెప్పారు.
అవినీతికి పాల్పడితే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే. తాజాగా చంద్రబాబు చెప్పింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించే అని అందరికీ తెలుసు. అయితే, ఇక్కడే చంద్రబాబు కొన్ని అంశాలను ఉద్దేశ్యపూర్వకంగా మరుగునపడేసారు. అవినీతికి పాల్పడిన నేతలు, వ్యాపారులు టిడిపిలో కూడా ఉన్నారు. ప్రజాసొమ్మను రికవరీ చేయాలంటే ముందు తన పార్టీ, ప్రభుత్వం నుండి మొదలుపెడితే బావుంటుంది.
అధికార పార్టీలో ఉన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి, రాయపాటి సాంబశివరావు.... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజాధనాన్ని దిగమింగిన వారి జాబితా టిడిపిలోనే చాంతాడంత ఉంటుంది. వారంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగొట్టిన వారే. ముందు వారి సంగతేంటో చూసి తర్వాత మిగిలిన వారి గురించి మాట్లాడితే బాగుంటుంది.
చంద్రబాబుకు అధికారంపై ఆశ కూడా బాగానే ఉన్నట్లుంది. ఏపిలో శాశ్వతంగా అధికారంలో ఉండిపోవాలట. తెలంగాణాలో అధికారం సాధించాలట. ఆశ ఉండటంలో ఎటువంటి తప్పు లేదు కానీ అత్యాశుంటేనే సమస్య. గడచిన మూడేళ్ళ పాలనలో చంద్రబాబుపై అన్నీ వర్గాల్లోనూ అసంతృప్తి పేరుకుపోయింది. ఆ విషయం ఎంఎల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది.
ప్రజావ్యతిరేకత మొదలైందన్న కారణంగానే పెండింగ్ లో ఉన్న11 మున్సిపల్ ఎన్నిలను నిర్వహించటం లేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళాలని వైసీపీ ఎంత డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవటం లేదు. ఇక్కడ కూడా ఓటమి భయమే స్పష్టంగా కనబడుతోంది చంద్రబాబులో. వాస్తవాలు ఇలావుంటే, ఏపిలో శాశ్వత అధికారంలో ఉండాలంటూ కలలుకంటున్నారు.