
పెట్టుబడుల కోసం చంద్రబాబునాయుడు మళ్ళీ విదేశాలకు వెళుతున్నారు. గడచిన మూడేళ్ళలో జరిపిన విదేశీ యాత్రల వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులేమిటో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే, విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా చంద్రబాబునాయుడు అనేక దేశాల్లో పర్యటించారు. సుమారు 20 దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
పర్యటనల ద్వారా ప్రచారమైతే వచ్చింది కానీ వచ్చిన పెట్టుబడులు మాత్రం సున్నా. ప్రతీ విదేశీ పర్యటన ముగియగానే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆశక్తి చూపారని ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయటం మీడియా అవి రావటం మామూలే అనుకోండి. కానీ ఇంత వరకూ ఏ దేశంనుండి ఎంత పెట్టుబడులు వచ్చాయి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. అంటే ఏ దేశం నుండి కూడా పెట్టుబడులు రాలేదన్నది అర్ధమవుతోంది. అప్పుల మీద నడుస్తున్న ప్రభుత్వానికి ఆ దండగమారి ఖర్చులు అవసరమా?
ఇంకోవైపు మూడేళ్ళల్లో రెండు భాగస్వామ్య సదస్సులు జరిగాయి. మొదటి సదస్సులో రూ. 2.9 లక్షల కోట్లు, రెండో సదస్సులో రూ. 10.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వ ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది.
అయితే, ఆ ప్రకటనల్లోని డొల్లతనాన్ని పరిశ్రమల శాఖే విప్పిచెప్పింది. మొదటిసారి జరిగిన సదస్సు ద్వారా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని చెప్పటం గమనార్హం. అదేవిధంగా రెండో సదస్సు తర్వాత కూడా రాష్ట్రానికి పెట్టుబడులు ఏమీ వచ్చినట్లు లేదు.
పెట్టుబడులు రాకపోగా సదస్సు నిర్వహణ పేరుతో ప్రభుత్వం సుమారు రూ. 50 కోట్లను క్షవరం చేసుకున్నది.
విశాఖపట్నంలో జరుపుతున్న సదస్సులోనే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తుంటే మళ్ళీ అదే పనికోసం విదేశాలకు ఎందుకు వెళుతున్నట్లు? కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నట్లు? అంటే ఖర్చులు మొత్తం ప్రభుత్వందనేనా?
అసలు ఇప్పటి వరకూ జరిపిన పర్యటనలెన్ని? ఏ దేశం నుండి ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయ్? పర్యటలకైన మొత్తం వ్యయం ఎంత అన్న విషయాలపై చంద్రబాబు ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుంది కదా?