
జససేన అధినేత పవన్ కల్యాన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో విడివిడిగా భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా పవన్ కల్యాణ్ భేటీ అవుతారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సమావేశం లేకుండా పవన్ కల్యాణ్ తిరుగుపయనమయ్యారు.
అయితే పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రెస్ మీట్ ఉండనుంది. అయితే ఈ మీడియా సమావేశంలో జనసేన భవిష్యత్ కార్యచరణకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ సోమవారం మురళీధరన్‌తో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులు, భవిష్యత్ కార్యచరణపై ఆయనతో పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. అదే రోజు రాత్రి కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌తో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై చర్చించారు. మంగళవారం రోజు ఉదయం మురళీధరన్‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ కూడా పాల్గొన్నారు.
మంగళవారం రాత్రి జేపీ నడ్డాను ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ కలిశారు. దాదాపు 45 నిమిషాల ఈ సమావేశం సాగింది. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై, వైసీపీ పాలన, ప్రతిపక్షాలపై దాడులతో పాటు ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలస్తోంది. జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ తమ అజెండా అని వివరించారు. ఆ దిశగానే తాము చర్చలు చేశామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వ్యవహరించడంపైనే ఫోకస్ పెట్టామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ సుస్థిరత్వం సాధించాలనే తాము సంకల్పించినట్టు పవన్ కళ్యాణ్ వివరించారు. అందుకోసం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వబోమని తెలిపారు. అటువైపు చర్చలు చేశామని అన్నారు. తమ చర్చలు ఇప్పటి వరకు పొత్తులపై మాట్లాడేంతగా వెళ్లలేవని అన్నారు. అయితే, బీజేపీ, జనసేన పార్టీలు రెండూ కూడా స్థానికంగా బలోపేతం కావడంపై శ్రద్ధ పెట్టినట్టు వివరించారు. ఈ చర్చల సత్ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని వివరించారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు వివరంగా వివరిస్తానని అన్నారు.