మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి మైలవరంలో పనిచేసేందుకు సిద్ధమన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. దేవినేని ఉమాతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, రాజకీయంగానే వున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన మైలవరంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే వసంత రాకపై మాజీ మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి మైలవరంలో పనిచేసేందుకు సిద్ధమన్నారు. త్వరలో టీడీపీలో చేరుతున్నానని.. ఇప్పటి వరకు దేవినేని ఉమ , నాది చేరోదారి అని కానీ నేటి నుంచి ఓకే దారి అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. దేవినేని ఉమాతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, రాజకీయంగానే వున్నాయని ఆయన తెలిపారు. టికెట్ విషయంలో అధినాయకత్వం రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తుందని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
తనకు దేవినేని ఉమకు ఎటువంటి గట్టు తగాదాలు లేవన్నారు. 5 మండలాల టీడీపీ అధ్యక్షులు , సీనియర్ నాయకులతో నియోజకవర్గంలో కలిసేందుకు వెళుతున్నానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ నేతలందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
టీడీపీ అధిష్టానంతో దేవినేని ఉమను, తనను కలిసి కూర్చోపెట్టి మాట్లాడమని అడుగుతానని వసంత వెల్లడించారు. పార్టీ అధిష్టానం సమక్షంలో మాట్లాడి ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. పార్టీ అధిష్టానం నియోజకవర్గం ఎవరికి అప్పజెబితే దాని ప్రకారం నడుచుకుంటానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. దేవినేని ఉమతో ఇప్పటి వరకు జరిగిన విషయాలపై క్లారిఫై చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.