గుంటూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్ధిగా ఎమ్మెల్యే ఆర్కే .. జగన్ ఇలా సెట్ చేశారా..?

By Siva Kodati  |  First Published Feb 26, 2024, 9:57 AM IST

రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానమైన గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలోకి దించుతారని గాసిప్స్ షికారు చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత ,సీఎం వైఎస్ జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సర్వేలు, తనకున్న సమాచారం ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఖరారు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత వుంటే తన సన్నిహితులు, ఆత్మీయులు, బంధువులు వున్నా నిర్మోహమాటంగా పక్కనపెట్టేస్తున్నారు. మరికొందరికి నియోజకవర్గాలు మార్చడంతో పాటు.. ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దించుతున్నారు. 

తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానమైన గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి వైసీపీ ఇన్‌ఛార్జీగా ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ నియమించారు. ఆయన కూడా ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లోనే రాజకీయం కీలక మలుపు తిరిగింది. వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎక్కడి నుంచి బరిలోకి దించుతారనే చర్చ నడుస్తోంది. 

Latest Videos

ఆర్కే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జీగా నియమించారు. ఆయన కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు గంజిని పక్కనపెడితే.. నియోజకవర్గంలో బలంగా వున్న పద్మాశాలి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి ఆర్కే పరిస్ధితి ఏంటీ అంటే.. మీడియాలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలోకి దించుతారని గాసిప్స్ షికారు చేస్తున్నాయి.

గడిచిన రెండ్రోజులుగా ఉమ్మారెడ్డి గుంటూరులో కనిపించకపోవడం, ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయారంటూ ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది. నిజంగానే ఆర్కేను జగన్ గుంటూరు బరిలో దించుతారా.. లేదంటే నారా లోకేష్‌ను ఓడించేందుకు తిరిగి మంగళగిరిలోనే కొనసాగిస్తారా అనేది తెలియాల్సి వుంది. 

click me!