జగన్ పై దాడి కేసు: సీల్డ్ కవర్ నివేదికపై హైకోర్టు అసంతృప్తి

By Nagaraju TFirst Published Dec 14, 2018, 1:06 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో కేంద్రప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయానికి సంబంధించి కేంద్రప్రభుత్వం సీల్డ్ కవర్ లో పంపించిన నివేదికపై హైకోర్టు మండిపడింది. 
 

హైదరాబాద్‌: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో కేంద్రప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయానికి సంబంధించి కేంద్రప్రభుత్వం సీల్డ్ కవర్ లో పంపించిన నివేదికపై హైకోర్టు మండిపడింది. 

సీల్డ్ కవర్ నివేదిక సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక పంపించాలని కేంద్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.  
ఇకపోతే విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్రప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. 

హత్యాయత్నం జరిగిన ప్రాంతం ఎన్‌ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందో రాదో పరిశీలన చేసి, ఆ తరువాత దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని కూడా వివరించింది. 

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా బహిర్గతం చేయకుండా సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో పంపిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ పూర్తి స్థాయి నివేదిక పంపాలని ఆదేశించింది.
 
కేంద్ర ప్రభుత్వం పంపిన సీల్డ్‌ కవర్‌ నివేదిక విషయంలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని జగన్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21లోగా మళ్లీ నివేదిక ఇవ్వాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించదని చెప్పారు. శుక్రవారంలోగా కేసును ఎన్‌ఐఏకు మీరు బదిలీ చేస్తారా? లేక మమ్మల్నే బదిలీ చేయమంటారా అని కూడా కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించిందని చెప్పుకొచ్చారు.  
 

click me!