
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సొంత రాష్ట్రంలోనే కాదు.. పక్క రాష్ట్రంలో కూడా అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఆయన రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఏపీలో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే.. ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం బస్టాండ్ వద్ద కొందరు అభిమానులు కేసీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా.. అనుమతి లేదంటూ అధికారులు దానిని తొలగించారు. దీంతో వివాదం మొదలైంది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, హైదరాబాద్ సెటిలర్ అయిన సీహెచ్ చినరెడ్డప్ప ధవేజీ, అతని స్నేహితులు మేడిద రాము, బుడితి అనిల్ కలసి తెలంగాణ బాహుబలి కేసీఆర్‌కు శుభాకాంక్షలు అని స్లోగన్ ఇస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
అయితే.. ఆ ప్రాంతంలో చాలా ఫ్లెక్సీలు ఉండగా.. కేసీఆర్ దే ఎందుకు తొలగించారని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు.ఆ ఫ్లెక్సీ తొలగింపుకి, మాకు ఏ సంబంధం లేదని పోలీసులు చెప్పడం గమనార్హం. టీడీపీ నేతలే ఈ ఫ్లెక్సీ తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరి కొన్ని చోట్ల జగన్, కేసీఆర్ ఇద్దరు ఫోటోలతో కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. ధర్మం గెలవడం ఇక్కడి నుంచే మొదలైంది అంటూ కొటేషన్స్ రాసి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్.. వైసీపీ కి మద్దతు అని చెప్పేందుకు ఈ రకం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది కొందరి వాదన.