
‘చంద్రబాబు అరాచకాలకు పెట్టింది పేరు...చంద్రబాబునాయుడు బస్సులు తగలబెట్టించారు’ ఇది కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పిన మాటలు. శుక్రవారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరాచకాలకు పెట్టింది పేరన్నారు. చూడబోతే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర తవ్వుతున్నట్లే ఉన్నారు. స్వార్ధం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారట. ఎన్టీఆర్ కు మొదటిసారి ముఖ్యమంత్రి పదవి పోయినపుడు చంద్రబాబు, ఉపేంద్ర రామకృష్ణా స్టూడియోలో కూర్చుని రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించారట. బస్సులు తగలబెట్టించి రాష్ట్రంలో దమనకాండకు పాల్పడ్డారని మండిపడ్డారు. పైగా అందుకు తానే సాక్ష్యమని కూడా చెబుతున్నారు.
అలాగే, పరిటాల రవి చనిపోయినపుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లకు ప్రేరేపించిన చరిత్ర చంద్రబాబుకుందన్నారు. పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 31 మందిని చంద్రబాబు చంపేసినా పోలీసులు ఏమీ చేయలేదని వాపోయారు. ఇదే ఘటన సౌదీ అరేబియాలో జరిగితే ఖచ్చితంగా ఉరిశిక్ష పడేదని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ను దింపేసినపుడు, పరిటాల రవి హత్యకు గురైనపుడు రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో జరిగిన అల్లర్లకు టిడిపి కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలే కారణమన్న ఆరోపణలైతే అప్పట్లో బాగా వినబడ్డాయి. అప్పటి ఆరోపణలనే తాజాగా ముద్రగడ కన్ఫర్మ్ చేస్తున్నారు. పైగా మొన్నటి తుని రైలు దహనం కూడా చంద్రబాబు పనే అని ఆరోపణలు చేయటమే కాస్త విచిత్రంగా ఉంది.