ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం.. బాధితుల ఆందోళన

By ramya neerukondaFirst Published Oct 9, 2018, 9:40 AM IST
Highlights

అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి మా ఇంటిపై రాళ్లు రువ్వారని, మా స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేయడానికి పూనుకున్నారని తెలిపారు.

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తమపై దౌర్జన్యానికి దిగి.. తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి ఆరోపించారు. ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి మా ఇంటిపై రాళ్లు రువ్వారని, మా స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేయడానికి పూనుకున్నారని తెలిపారు. ఈ సంఘటనపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ పాడేరు సీఐ, ఎస్‌ఐ సమక్షంలోనే ఆదివారం రాత్రి తమపై దౌర్జన్యానికి దిగారని చెప్పారు.

రెండు జేసీబీలు, లారీలు తెచ్చి రోడ్డు వేయడానికి చిప్స్, ఇతర సామగ్రిని అక్కడవేసి,  రోడ్డు వేయడం కోసం   నాలుగు గంటలసేపు పనులు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే దౌర్జన్యంపై పోలీసు అధికారులకు రాత్రి ఫోన్‌లో సమాచారం ఇచ్చామని, దీంతో అక్కడకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కూలీలను తీసుకువచ్చి దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించారని తెలిపారు. మా ఇరువర్గాల మధ్య ఈ స్థల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని, అయినప్పటికీ ఎమ్మెల్యే మా హక్కులో ఉన్న పట్టా భూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతో పదవిని అడ్డంపెట్టుకుని ఈ దురాగతానికి పాల్పడుతున్నారని ఆమె వాపోయారు.

ఇలా అర్ధరాత్రి   గతంలో నాలుగు సార్లు తమపై దౌర్జన్యం జరిపారని చెప్పారు. స్థల వివాదం కోర్టులో ఉన్నందున  ఇరువర్గాల వారు   ఎటువంటి పనులు చేయరాదని తహసీల్దార్‌ సూచించారని, అయినా ఎమ్మెల్యే రోడ్డుకోసం స్థలం ఆక్రమిస్తుండడంపై తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యంపై మంగళవారం ఏఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వెంటనే గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపి తమ హక్కులో ఉన్న భూమిని అప్పగించి, సత్వర న్యాయం చేయాలని ఆమె సబ్‌ కలెక్టర్‌ను  కోరారు. దీనిపై సబ్‌ కలెక్టర్‌ స్పందించి భూ వివాదంపై విచారణ జరిపినప్పుడు వీలునామా, పట్టా రికార్డులను తీసుకురావాలని సూచించారు.

click me!