28 ఎంపీలు ఉన్నారుగా, వచ్చే పార్లమెంట్ సెషన్లో VSP(వైజాగ్ స్టీల్ ప్లాంట్) అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ము మీకుందా? అని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: ''సీఎం జగన్ గారు విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం చేయిస్తే విమర్శించారు. మరి మహానాడులో స్టీల్ ప్లాంట్ పై తీర్మానం ఏది? ఓ పోరాట యోధునిలా ఉగిపోయావుగా. తీర్మానం చేయడానికి ప్యాంట్లు తడిసిపోతే ఎలా? నువ్వా ఢిల్లీలో పోరాడేది. నిన్ను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే'' అంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికన తనపై చేసిన విమర్శలపై టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు.
''28 ఎంపీలు ఉన్నారుగా, వచ్చే పార్లమెంట్ సెషన్లో VSP(వైజాగ్ స్టీల్ ప్లాంట్) అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ము మీకుందా? రాష్ట్ర ప్రజల మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టి, ఆ తీర్మానానికి మనస్పూర్తిగా మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది!'' అని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
''ఢిల్లీ మెడలు వంచుతా అని శపధాలు చేసి, అక్కడికెళ్లి కాళ్ళు మొక్కుతోంది ఎవరో, ఎందుకో అందరికీ తెలుసు. పార్లమెంట్లో 28 ఎంపీలు ఉన్నా, ఒక్కరు కూడా అక్కడ గొంతెత్తి ప్రశ్నించకుండా, ప్రతిపక్షం సమావేశాల్లో ఎమీ మాట్లాడలేదు అంటూ దద్దమ్మ కబుర్లు చెపితే, మీ వెర్రితనం చూసి జనాలు నవ్విపోతారు'' అని మండిపడ్డారు.
read more హైదరాబాదులో ఏపీ సీఐడి చేతిలో అరెస్టు: కేసీఆర్ కు రఘురామ కృష్ణం రాజు లేఖ
అంతకుముందు కరోనాతో తండ్రిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సాయం ప్రకటనపై రామ్మోహన్ స్పందించారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలకు ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం పథకానికి తగిన సవరణలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
''ఫిక్స్డ్ డిఫాజిట్ మొత్తాన్ని రూపాయలు 10 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని, రుజువుగా కేవలం కరోనా పాజిటివ్ టెస్టునే కాకుండా, డెత్ సర్టిఫికెట్ ను కూడా అంగీకరించాలని, ఈ పిల్లలకు తక్షణ ఉపశమనం కోసం వెంటనే రూపాయలు 3లక్షలు ఇవ్వాలని, గ్రాడ్యుయేషన్ వరకు వీరి చదువుకు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని కోరాను'' అని రామ్మోహన్ వెల్లడించారు.