ప్రముఖ సినీ నటుడు నాని నటించిన తాజా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ప్రముఖ సినీ నటుడు నాని నటించిన తాజా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. సినిమా బాగుందని, అందరూ చూడాలని కోరారు. అదే సమయంలో ఇందులో మద్య నిషేధం గురించి చూపించారని పేర్కొన్న రఘురామ.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అసలు నేచురల్ స్టార్ సీఎం జగన్ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. శనివారం రోజున రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
‘‘దసరా సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమిటంటే.. ఒక ఊరిలో మద్యం ఏం చేసిందనే దాని గురించి. ఆ ఊరును రాష్ట్రంగా చూడండి. మద్యం తీసేస్తాని అన్నవాడు ఓడిపోతాడు. మద్యం ఇస్తానని.. డబ్బులు ఇస్తానని అన్నోడు గెలుస్తాడు. దానికి పర్యవసానం కూడా సినిమాలో చూపెట్టారు. ఓటర్లలలో మగవాళ్ల సంఖ్య తగ్గిపోయి.. ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే.. మగవాళ్లందరూ చీప్ లిక్కర్ తాగడమే. ఆ సినిమాలో చూపించిన లిక్కర్ సెంటర్ పేరు సిల్క్ లిక్కర్ సెంటర్.
ఇలాంటి చెత్త సరుకు అమ్మి ప్రజల ప్రాణాలు తీసి మగవారి సంఖ్య తగ్గించి ఆడవారి సంఖ్య పెరిగిపోయేలా చేస్తున్నారని చివరకు ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇలాంటి దరిద్రులను ఎన్నుకుని తప్పు చేశామని భావించి.. నెక్ట్స్ ఎన్నికల్లో వారిని ఓడిస్తారు. అప్పటి వరకు చేసిన అఘాయిత్యాలకు తిరగబడతారు. ఇక, అది సినిమా కాబట్టి అందులో చంపేస్తారు. అది వేరు. మనం మట్లాడుకునేది ఓట్ల వరకు.. లిక్కర్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాల తీసిన దుర్మార్గులను ఎన్నికల్లో ఓడిస్తారు.
ఆ సినిమా అందరూ చూడండి. తప్పనిసరిగా చూడండి.. మనకు ఒక స్ఫూర్తినిస్తుంది. మహిళలు చూడాలి.. మీరు తిరగబడాలి. మిమ్మల్ని మోసం చేశాం మేము. సిగ్గు లేదా మీకు అని మమ్మల్ని అడగరా?. ఏమయ్యా రఘు.. ఎన్నికల్లో మీ పార్టీ మద్యాన్ని నిషేధిస్తానని చెప్పింది.. మీరు చేసిందేమిట్రా.. నాలుగు రేట్లు ధరలు పెంచారని ప్రశ్నించరా?. అమ్మ ఒడి రూపంలో ఇచ్చింది.. నాన్న పోటు రూపంలో డబుల్ లాగేశారని మమ్మల్ని తిట్టండి.
మీకు సిగ్గు ఉంటే మమల్ని తిట్టండి. మేం చెప్పాం కదా.. నిషేధం లేకుంటే ఓట్లే అడగనని అరిచాడు కదా మావోడు. ఓటు అడగనన్న వ్యక్తి.. ఈ లిక్కర్ తాగి ఎంతో మంది చనిపోవడానికి కారణమవుతున్నాడు. కిడ్నీలు, లివర్ పోయి ఎంతో మంది చనిపోతున్నారు. అందులో కెమికల్స్ ఉన్నాయని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఎవరొచ్చారు.. ఎలా మేనేజ్ చేశారనేది అన్ని మాకు తెలుసు. దసరా మూవీ చూడండి. నాని ధైర్యవంతుడైన కుర్రాడు.
అసలు నేచురల్ స్టార్ జగనే.. రియల్ లైఫ్ నేచురల్ స్టార్ జగన్ అయితే.. రీల్ లైఫ్ నేచురల్ స్టార్ నాని. మద్య నిషేధం గురించి మహిళల ఆ సినిమాను.. మిమ్మల్ని మోసం చేసిన మాలాంటి నాయకులను ప్రశ్నించండి. దయచేసి నువ్వు చెప్పిందేంటి.. చేసిందేంటని ప్రశ్నించండి. మేము వేరే వేరే స్లోగన్‌తో మీ దగ్గరకు వస్తాం.. నన్ను రానీయరు. మా ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వస్తున్నారు.. అప్పుడు ఇచ్చిందెంతా? కొట్టేసిందెంతా అని ప్రశ్నించండి’’ అని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.