సత్తెనపల్లి టిక్కెట్టు విసయంలో జగన్ నిర్ణయం ప్రకారంగా నడుచుకుంటానని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు.
గుంటూరు: తన ప్రాణం ఉన్నంత వరకు సత్తెనపల్లిలోనే ఉంటానని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆదివారంనాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. సత్తెనపల్లిలో వైరి వర్గం ఇవాళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడంపై అంబటి రాంబాబు స్పందించారు. సత్తెనపల్లిలో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించడంతో తాను ఇక్కడికి వచ్చినట్టుగా అంబటి రాంబాబు గుర్తు చేశారు.
also read:సత్తెనపల్లిలో అంబటికి పోటీ: అనుచరులతో నేడు విజయ భాస్కర్ రెడ్డి విందు రాజకీయం
టిక్కెట్టు విషయంలో సీఎం జగన్ దే తుది నిర్ణయమన్నారు. ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానన్నారు. సత్తెనపల్లిలో తనను పోటీ చేయవద్దని జగన్ కోరితే తాను పోటీకి దూరంగా ఉంటానన్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను వ్యవహరించబోనని ఆయన స్పష్టం చేశారు. సత్తెనపల్లిని తన ప్రాంతంగా నిర్ణయించుకున్నట్టుగా ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో సీట్ల కోసం ఎవరైనా పోటీ పడవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటివి సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. అసంతృప్తుల వ్యవహరం పార్టీ నాయకత్వం చూసుకుంటుందని అంబటి రాంబాబు చెప్పారు.