‘నా పేరు, హోదాను అక్రమంగా వినియోగిస్తున్నారు’... సోదరుడిపై ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు..

By SumaBala BukkaFirst Published Jul 20, 2022, 9:03 AM IST
Highlights

టీడీపీ ఎంపీ కేశినేని నాని తమ్ముడి మీద ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంలో వివరాలు ఇలా ఉన్నాయి. 

విజయవాడ : ‘నా పేరు, హోదాను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారు.  Vijayawada పార్లమెంటు సభ్యుడుగా ఉన్న నేను వినియోగించే VIP వాహనం స్టిక్కర్..  నకిలీది చేసి... వినియోగించి  విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతున్నారు. ఆ వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి. వాహనం నెంబర్ TS07హెచ్ 7777’.. ఇది ఇటీవల విజయవాడ ఎంపీ Kesineni Nani పటమట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు. మే నెల 27న ఈ మేరకు ఫిర్యాదు చేయగా.. జూన్ 9వ తేదీన దీనిమీద FIR నమోదయింది. ఐపీసీ 420, 416,415,468,499 రెడ్ విత్ 34 కింద కేసు ( ఎఫ్ ఐ ఆర్ 523/2022) నమోదు చేశారు. ఈ వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు.  అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలి వేశారు.

వెహికల్ ఎవరిది?
ఈ వెహికల్ కేశినేని జానకి లక్ష్మి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. దీన్ని ఆమె భర్త కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారు. కేశినేని చిన్ని స్వయంగా నానికి సోదరుడు అవుతాడు. ఆయన హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. కాగా ఎంపీ అయి ఉండి, సొంత సోదరుడిపైనే ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడం, పోలీసులు విచారణ చేయడం… ఈ విషయాలన్నీ ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Political war: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ కుటుంబంలో రాజకీయ చిచ్చు !

ఏం జరిగిందంటే…
 విజయవాడ ఎంపీగా కేసినేని నాని టిడిపి నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో ఆయనకు తోడుగా సోదరుడు కేశినేని  చిన్ని కీలక పాత్ర  పోషించేవారు. ఇటీవల చిన్ని క్రియాశీలకంగా టిడిపి రాజకీయాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానానికి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఎదగాలి అనుకుంటున్నారని పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. మరోవైపు  కేశినేని నాని రెండోసారి గెలిచిన తర్వాత పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిగానే ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన చేసిన ట్వీట్లు పార్టీలో వివాదాలకు దారి తీసింది.  

తన పార్లమెంట్ నియోజకవర్గంలో పలువురు నాయకులతో విభేదాలున్నాయి. మైలవరం ఇన్చార్జిగా ఉన్న దేవినేని ఉమా, పశ్చిమ నియోజక వర్గానికి చెందిన  బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, జగ్గయ్యపేటకు చెందిన శ్రీరామ్  తాతయ్యలతో కూడా అభిప్రాయ భేదాలు  వచ్చాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తన కూతురును మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి వివాదానికి తెరలేపారు. ఈ విషయంలో సెంట్రల్ ఇన్చార్జి బోండా ఉమామహేశ్వర రావుతోనూ అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.

పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎంపీ కేశినేని నానికే అప్పగించారు. బుద్ధ వెంకన్న వర్గం దీనికి సహకరించటంలేదు. ఇటీవల పదవ డివిజన్ నుంచి గెలుపొందిన ఆయన కూతురు కేశినేని శ్వేత క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఇటీవల జరిగిన టిడిపి మహానాడుకు కూడా ఎంపీ హాజరుకాలేదు. తర్వాత చంద్రబాబును కలిశారు. జిల్లాలో 35 నియోజకవర్గాలకు చెందిన రైతు పోరుకు హాజరు కాలేదు. ఆయన సోదరుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సోదరుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోదరుడి పైన ఎంపీ కేసు పెట్టారని చెబుతున్నారు. 

click me!