
శ్రీకాకుళం : రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడిన ఆ విద్యార్థి తెల్లారేసరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా డెంకాడలో జరిగింది. దీంతో అటు స్నేహితులకు, ఇటు కన్నవారికి తీరని వేదన మిగిల్చాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, తల్లిదండ్రులు, స్నేహితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కుడ్డబకు చెందిన గంటా శివకుమార్ (20) ఎంవీజిఆర్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే హాస్టల్ లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు.
మంగళవారం ఉదయం కాలేజీకి వస్తామని తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకోలేదు. మంగళవారం ఉదయం తమ కుమారుని చూడడానికి కాలేజీకి వచ్చిన తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అతని స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పారు. వారు అతని గదిలోకి వెళ్ళి చూసేసరికి.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని, వేలాడుతూ కనిపించాడు. వెంటనే తల్లిదండ్రులు, హాస్టల్ అధికారులకు సమాచారం అందించి… చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వసతి గృహం యాజమాన్యం సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మల్లేశ్వరరావు ఆర్మీలో పని చేస్తున్నాడు. భోగాపురం సీఐ విజయ్ నాథ్, ఎస్సై పద్మావతి ఘటనపై ఆరా తీశారు. ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. దీంట్లో భాగంగానే ఈ యువకుడు ఫోన్ ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం పెట్టిన చిచ్చు.. అన్నంలో పురుగుల మందు కలుపుకుని, తల్లీ ఇద్దరు బిడ్డలు ఆత్మహత్యాయత్నం...
ఇదిలా ఉండగా, తమిళనాడులోని కళ్లకురుచ్చిలో ఓ విద్యార్థిని భవనం మీదినుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు, అధికారులను అదుపులోకి తీసుకున్నట్టయ్యింది. తమిళనాడులోని కళ్లకురిచ్చిలో ఓ 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో మరణానికి కారణం శరీరం మీద అనేక గాయాలు, రక్తస్రావం కావడమేనని తేలింది.
తమిళనాడులోని సేలం జిల్లాలో జూలై 13న ఓ 12వ తరగతి విద్యార్థిని తన హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో.. హింస చెలరేగింది. ఆమెను ఉపాధ్యాయుడు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోమవారం ఆ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ హరిప్రియ, మ్యాథమెటిక్స్ టీచర్ కృతికను అరెస్ట్ చేశారు. అంతకుముందు, ప్రిన్సిపాల్, సెక్రటరీతో సహా పాఠశాలకు చెందిన ముగ్గురు మేనేజ్‌మెంట్ అధికారులను అరెస్టు చేశారు. గత మంగళవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోగా... బుధవారం ఉదయం హాస్టల్ వాచ్‌మెన్ నేలపై పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించి పాఠశాల అధికారులకు సమాచారం ఇచ్చాడు.