భర్త వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య.. !!

By SumaBala BukkaFirst Published Feb 7, 2023, 9:49 AM IST
Highlights

భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని హింసిస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తాను ఆత్మహత్య చేసుకుంది. 

పల్నాడు :  ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది.  ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట లోని పెద్ద చెరువు ప్రాంతంలో చోటుచేసుకుంది.  ఈ ఘటనకు సంబంధించి డిఎస్పీ విజయభాస్కరరావు వివరాలు ఈ మేరకు తెలిపారు. పిల్లలని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళ పేరు శివలింగేశ్వరి(27).  ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం  నరసరావుపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డి తో పెళ్లయింది. శివలింగేశ్వరిది రొంపిచర్ల మండలం నల్లగార్ల పాడు. 

ఇంద్రసేనారెడ్డి  ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తుంటాడు. నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులో అతనికి దుకాణం ఉంది. వీరికి చరణ్ సాయి రెడ్డి(8), జతిన్ రెడ్డి (4) అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే, ఇటీవల ఇంద్ర సేనారెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రోజూ భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా భార్యను విపరీతంగా కొట్టాడు. దీంతో శివలింగేశ్వరి మనస్తాపం చెందింది. ఈ కోపంతోనే భర్త బైటికి వెళ్లగానే పిల్లలకు ఉరేసి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

విశాఖ బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు? మార్చి ఎండింగ్ లో మారబోతున్నారా?...

ఇదిలా ఉండగా, ఆదివారం వరంగల్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ బీజేపీ నేత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం వరంగల్ ఎనుమాముల బాలాజీ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి. బిజెపి నేత గంధం కుమారస్వామి(45) బాలాజీ నగర్ నివాసి.  

రాజకీయాల్లో కొనసాగుతూనే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో  వ్యాపారం చేస్తున్నాడు. వరంగల్ నగరపాలక సంస్థకు జరిగిన గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ నుండి కార్పోరేటర్ టికెట్ ఆశించాడు. అయితే, అది ఆయనకు రాలేదు. దీంతో  కుమారస్వామి టీఆర్ఎస్ లోనుంచి బీజేపీలోకి చేరారు. బిజెపి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎనుమాముల మాజీ సర్పంచ్ సాంబేశ్వర్ నుంచి ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఎన్నికల సమయంలో రూ. 25 లక్షలు తీసుకున్నాడు. 

అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఓవైపు ఓటమి బాధ కృంగదీస్తోంది.  మరోవైపు ఇచ్చిన 25 లక్షలు తిరిగి ఇవ్వమంటూ మాజీ సర్పంచ్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ ఒత్తిడి తట్టుకోలేక తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. నమ్మినవారు తనను మోసం చేశారని, నేను చనిపోయిన తర్వాత ని భార్యా పిల్లలను వేధించొద్దంటూ లేఖ కూడా రాశారు. ఆ తర్వాత ఆ సెల్ఫీ వీడియోను స్నేహితులకు పంపించాడు.  ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఆ సమయంలో ఆయన భార్య మరో గదిలో ఉంది. 

అతను ఆత్మహత్యాప్రయత్నం చేయడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి అతను మరణించాడు. కుమార స్వామికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఈ మృతి పట్ల కుటుంబ సభ్యులు  తేరుకోలేకపోతున్నారు. గంధం కుమారస్వామి భార్య లక్ష్మి భర్త మరణానికి కారణం సాంబేశ్వర్, ఆయన భార్య ప్రమీల, మరో వ్యక్తి కోట విజయకుమార్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, చిన్న పరిశ్రమల విభాగంలో కుమారస్వామి  ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు కూడా అందుకున్నారు. 

click me!