విశాఖ బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు? మార్చి ఎండింగ్ లో మారబోతున్నారా?...

By SumaBala BukkaFirst Published Feb 7, 2023, 6:44 AM IST
Highlights

విశాఖకు పాలనా రాజధాని మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టుగా.. ప్రస్తుతం విశాఖలో ముఖ్యమంత్రి నివాసం కోసం వెతుకుతున్నట్లు సమాచారం. 

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇటీవల  విశాఖ రాజధానిగా మారబోతుందని, తన నివాసం విశాఖకి  మార్చబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో..  స్థానిక జిల్లా యంత్రాంగం విశాఖకు రాజధాని తరలింపు  పనుల మీద  దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ..  తాను విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని ప్రకటించారు. ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా ఇదే విషయాన్ని కొంతకాలంగా పదేపదే చెబుతున్నారు.

అయితే దీని మీద జిల్లా యంత్రాంగానికి ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదు. కానీ మౌఖిక ఆదేశాల ప్రకారం పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రాజధాని తరలింపుకు సంబంధించిన సమాచారం ఏ క్షణంలో వచ్చిన వెంటనే తగిన ఏర్పాట్లు చేసేందుకు అనుగుణంగా ముందస్తుగా అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని భవనాలను రహస్యంగా పరిశీలిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లుగా  నివాసాన్ని విశాఖకు మార్చడానికి వీలుగా ఉండేలా.. బీచ్ రోడ్డులో అనుకూలమైన ఇంటి కోసం అధికారులు వెతుకుతున్నారు. 

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, టీడీపీ శ్రేణుల ఆందోళన.. మచిలీపట్నంలో ఉద్రిక్తత

మార్చి 22, 23వ తేదీల్లో అన్ని అనుకూలించి, సరైన ఇల్లు దొరికితే ముఖ్యమంత్రి గృహప్రవేశం ఉంటుందని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల విశాఖలో ఎంవీపీ న్యాయవిద్యా పరిషత్తు పక్క నుంచి విఎంఆర్ డిఏ అధికారులు రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టారు. దీంతో ఈ మార్గంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇల్లు ఉండవచ్చని సమాచారం తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా తాము ఉండడానికి అనుకూలమైన బిల్డింగుల కోసం వెతుకుతున్నారు. 

వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల కోసం ఎంఎసి అంకోశా సమీపంలో చేపట్టిన డూప్లెక్స్ ఇల్ల నిర్మాణాల్లో వేగం పెరిగింది. మొత్తం పరిపాలన విశాఖకు మారబోతుండడంతో  సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా జాగ్రత్తపడుతున్నారు. విశాఖపట్నంలో తగిన నివాసాల కోసం తమ పరిచయస్తుల ద్వారా వెతుకుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలేవీ అధికారికంగా ధ్రువీకరించడంలేదు. 

click me!