
నంద్యాల : రెండేళ్ల కూతురితో కలిసి భార్యాభర్తలు బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆర్టిసి బస్సు బైక్ ను ఢీకొట్టడంతో తల్లీకూతురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన మనోహర్ కు బసగానపల్లెకు చెందిన లక్ష్మితో వివాహమయ్యింది. వీరికి రెండేళ్ల మానస సంతానం. పుట్టింటికి వెళదామని లక్ష్మి కోరడంతో నిన్న(సోమవారం) భార్యా కూతురుని తీసుకుని బైక్ పై బనగానపల్లెకు బయలుదేరాడు మనోహర్. అయితే మార్గమధ్యలో బసగానపల్లె నుండి గుత్తి వెళుతున్న ఆర్టిసి బస్సు వీరి బైక్ ను ఢీకొట్టింది. బైక్ పైన వున్నవారు అమాంతం ఎగిరి రోడ్డుపై పడిపోయినా బస్సు ఆగలేదు. అలాగే ముందుకు కదిలిన బస్సు చక్రాల కింద లక్ష్మి, రెండేళ్ళ మానస నలిగిపోయింది. మనోహర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తల్లికూతురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆర్టిసి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఇప్పటికే సదరు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More పదేళ్ల తర్వాత తండ్రి ఇంటికొచ్చిన రోజే... యాక్సిడెంట్ లో కొడుకు మృతి
తల్లీబిడ్డ మృతికి కారణమైన ఆర్టిసి డ్రైవర్ ను తమకు అప్పగించాలని బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నామని... బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబం, బంధువులు నిరసన విరమించారు.