వైసీపీ వైఫల్యాలు, అవినీతిపై ‘ఛార్జిషీట్’.. ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ.. మోదీ దిశానిర్దేశం..

By SumaBala BukkaFirst Published Nov 12, 2022, 7:35 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్  టూర్ లో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఏపీ బిజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పటిష్టత కోసం ఏ చేయాలో, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలో వివరించారు. 

అమరావతి : వైసిపి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చార్జిషీట్లు రూపొందించి, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని ఆదేశించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని అన్నారు. ‘ఒకప్పుడు  గుజరాత్, కర్ణాటక, ఏపీల్లో పార్టీ పరిస్థితి ఒకేలా ఉండేది. ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఇప్పుడు బాగా పటిష్టమైంది. కానీ ఏపీలో పరిస్థితి బాలేదు. రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి అందరూ కృషి చేయాలి. మనకు మన పార్టీ ముఖ్యం’ అని ఆయన స్పష్టం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి సుమారు గంటన్నరసేపు పార్టీ రాష్ట్ర శాఖ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత నేతలు మాట్లాడే సమయంలో ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజా సమస్యలపై ..పోరాటం
‘వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోంది. వీటిని ప్రజలలోకి తీసుకువెళ్ళండి. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ అవినీతి, లోపాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టాలి. ఇందుకు వెనకాడొద్దు. దీనికి సమాంతరంగా రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు గురించి వివరించాలి. రాజకీయాల్లో నిదానం అస్సలు పనికిరాదు. నిత్యం వేగంగా ఉండకపోతే మన స్థానాన్ని మరొకరు ఆక్రమించేస్తారు. సమస్య చిన్నదా,పెద్దదా అని చూడకుండా స్థానిక సమస్యలు పరిష్కారం కోసం నిత్యం గళమెత్తుతూనే ఉండాలి. 

రేపు విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభ.. వేదికపైకి 8 మందికి మాత్రమే అనుమతి.. ఎవరెవరికంటే..

ఉపప్రధానిగా అద్వానీ ఉన్నప్పుడు ఐదు వందల మీటర్ల రోడ్డు ప్రారంభానికి పిలిస్తే మొదట సంకోచించారు. వెళ్లి వచ్చాక సంతృప్తి వ్యక్తం చేశారు. వందే భారత్ రైళ్లను స్వయంగా జెండా ఊపి ప్రారంభిస్తున్నా. ఈ కార్యక్రమానికి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ, ఎందుకు వెళ్తున్నాను? అభివృద్ధి కోసం మనం చేసే కృషి గురించి ప్రజలకు తెలియాలి కదా.. ! అభివృద్ధి గురించి చెప్పడంలో, ప్రభుత్వం లోపాలు ఎండగట్టడంలో మీమాంస వద్దు’ అని దిశానిర్దేశం చేశారు.

కబడ్డీ, వాలీబాల్  పోటీలు..
‘అంగన్వాడీల దగ్గర నుంచి పార్టీ కార్యకలాపాలు కొనసాగాలి. పిల్లలకు పోషకాహారం సక్రమంగా అవుతుందో, లేదో మహిళా మోర్చల ద్వారా నిశితంగా పరిశీలించాలి. యువకులకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీ ప్రజలకు మరింత చేరువవుతుంది. గుజరాత్ లో పార్టీ పటిష్టత కోసం మేము ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలకు చేరువయ్యాం.  మన పార్టీ మనకు ముఖ్యం. జాతీయస్థాయి నిర్ణయాలు మేము చూసుకుంటాం. పార్టీ పటిష్టతపైనే మీ దృష్టి పూర్తిగా ఉండాలి.  ఇప్పటికే రాజకీయాలపై ప్రజల్లో విసుగొచ్చింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని  ప్రజలకు పార్టీని చేరువ చేయాలి’ అని నేతలకు కర్తవ్యబోధ చేశారు.

పార్టీ అభివృద్ధి కోసం ఏం చేశారు?
‘పార్టీ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏం చేశారు? శక్తి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? పోలింగ్ బూత్ స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?’ అని ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పందిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై సభలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో ఓ సీనియర్ నేత భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని వాటిపై పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఒకరు మాట్లాడుతూ వైసీపీతో బిజెపి సన్నిహితంగా ఉందని  ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. 

సోము వీర్రాజు తడబాటు..
రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అని ప్రధాని మోదీ సోము వీర్రాజును అడిగారు. ఆయన 21 అని చెప్పడంతో వెంటనే పక్కనున్న వారు 26 అని అందించారు. మండలాలు ఎన్ని  ఉన్నాయి అని అడగగా వీర్రాజు జవాబు చెప్పడానికి తడబడ్డారు. పక్కనున్న మరో నేత గణాంకాలు వివరించారు. ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ,  ఎంపీలు జివిఎల్ నరసింహారావు,  సీఎం రమేష్, మాజీ ఎంపీలు  సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి,  మాధవ్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మీ తండ్రి పీవీ చలపతిరావు ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఎమ్మెల్సీ మాధవ్ ను మోడీ ఆరా తీశారు. 

click me!