తిరుపతి సభలో మోడీ అలా చెప్పలేదు, ఎడిట్ చేశారు: విష్ణుకుమార్ రాజు

First Published Apr 29, 2018, 8:22 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి ఎన్నికల ప్రచార సభలో చెప్పలేదని బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు.

విశాఖపట్నం/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి ఎన్నికల ప్రచార సభలో చెప్పలేదని బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని మాత్రమేనని, నరేంద్ర మోడీ మాటలను మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. 

నెల్లూరు సభలోని మోడీ ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఢిల్లీలో చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారని అన్నారు.తిరుపతి సభలోనైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని అన్నారు. తప్పుడు భావనతో దీక్ష చేస్తే పాపం చుట్టుకుంటుందని అన్నారు. 

మంత్రి గంటా శ్రీనివాస రావుపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. మాటలు అదుపులో పెట్టుకోకపోతే గంట మోగినా సౌండ్ లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. 

రైల్వే జోన్ అంశాన్ని భుజంపై వేసుకోవడానికి ఆయనేమీ బాడీ బిల్డర్ కాదని వ్యంగ్యంగా అన్నారు. గంటా ఎప్పుడైనా రైలెక్కారా, ఎందుకు రైల్వే జోన్ గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పార్టీ వ్యక్తి గంటా అని అన్నారు. 

చంద్రబాబు ఒక్క రోజు దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు చేశారని, మోడీ దీక్షకు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదని బిజెపి అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల అన్నారు. తప్పులు ఎత్తి చూపితే చంద్రబాబు తెలుగువారిపై దాడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన విజయవాడలో ఆదివారం అన్నారు. 

ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ నోటికొచ్చినట్లు ప్రధానిని తిడుతుంటే చంద్రబాబు కనీసం వారించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు తన అవినీతి బయటకు రాకుండా ఉద్యోగులతో, విద్యార్థులతో బలవంతంగా ఆందోళనలు చేయిస్తున్నారని ఆయన  విమర్శించారు. 

కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పకుండా టీడిపి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.

click me!