
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి రివర్స్ వ్యవహారం జరుగుతోంది దేశంలో. నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు అందుకు తీరే ఉదాహరణ. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి వీరిద్దరు ఎన్నో దేశాలు తిరిగారు. ఇంకెన్ని దేశాలు తిరుగుతారో తెలీదు. తమ విధానాలతో ఇంట గెలుస్తున్నారో లేదో తెలీదు కానీ రచ్చ గెలిచే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. విదేశాలతో మన సంబంధాలను బలోపేతం చేయటం కోసమని ఒకరు, ప్రపంచస్ధాయి రాజధాని, పెట్టుబడుల పేరుతో మరొకరు విదేశాల్లో తిరిగింది తిరిగిందే.
మోడి విదేశీ పర్యటనల వల్ల కొత్తగా మన దేశం బలోపేతమయ్యేదేముంది? మోడి విదేశాలు చుట్టకపోతే బలహీనపడేదీ లేదు. మొదటి నుండి మన దేశం అగ్రదేశాల్లోని చాలా దేశాలతో మంచి సంబంధాలనే కలిగి ఉంది. అయినా సరే మోడి విదేశాలకు వెళ్లాలనుకున్నారు వెళుతున్నారంతే. విదేశీ పర్యటనల్లో మోడికి అంతచిత్తశుద్ది ఉంటే మరి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్నే పంపొచ్చు కదా? ఆమెను ఏ దేశానికీ పంపక, తనతో పాటూ తీసుకెళ్ళక మరి సుష్మను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా మోడి ఎందుకు నియమించినట్లు?
ఇక, చంద్రబాబు విషయం చూస్తే మరింత విచిత్రంగా ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటి వరకూ సుమారు 20 దేశాలు తిరిగుంటారు. ప్రపంచస్ధాయి రాజధాని నగరాలను సందర్శించటం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా తాను పర్యటనలు చేస్తున్నట్లు చంద్రబాబు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అదే నిజమైతే, రెండున్నరేళ్ళైనా ఇంకా రాజధానికి మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం కాలేదు? మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను సింగపూర్ కో లేక ఇంకోరికో అప్పగిస్తే ప్రత్యేక విమానాల్లో చంద్రబాబుకు విదేశాలు చుట్టాల్సిన అవసరమేంటి? ఖర్చు దండగ కాకపోతే.
ఇక పెట్టుబడులంటున్నారు. చంద్రబాబు తిరిగిన దేశాల నుండి ఏ మేరకు పెట్టుబడులొచ్చాయి. అంతెందుకు విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు వల్ల ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఒప్పందాలనే పెట్టుబడులుగా చెబుతు జనాలను చంద్రబాబు భ్రమల్లో ఉంచుదామనుకుంటున్నారు. ఒప్పందాలు వేరు..పెట్టుబడులు రావటం వేరు. ఒప్పందాలకు..పెట్టుబడులు రావటానికి ‘ఆవకాయకు-ఆవగింజ’కు ఉన్నంత తేడా ఉంది. చేతిలో ఆవాలున్నంత మాత్రానా ఆవకాయ పెట్టినట్లు కాదు కదా? పెట్టుబడుల కోసం భాగస్వామ్య సదస్సు జరపటం కూడా అంతే. ఇంట గెలిచే విషయం ఎలాగున్నా మోడి, చంద్రబాబులు విదేశీ యాత్రలతో రచ్చ గెలిచే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు.