అందుకే రోడ్డు ప్రమాదంగా ఎమ్మెల్సీ అనంతబాబు చిత్రీకరణ: డ్రైవర్ సుబ్రమణ్యం హత్యపై ఎస్పీ

Published : May 23, 2022, 09:43 PM ISTUpdated : May 23, 2022, 09:48 PM IST
అందుకే రోడ్డు ప్రమాదంగా ఎమ్మెల్సీ అనంతబాబు చిత్రీకరణ: డ్రైవర్ సుబ్రమణ్యం హత్యపై ఎస్పీ

సారాంశం

కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసినట్టుగా కాకినాడ ఎస్పీ రవీంద్ర బాబు ప్రకటించారు. ఎమ్మెల్సీపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.


కాకినాడ: కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ  అనంతబాబు ప్రధాన నిందిుతుడని కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు చెప్పారు. సోమవారం నాడు రాత్రి Kakinada  ఎస్పీ Ravindra Babu  కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు   వివరించారు.ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ  Ananthababu అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ ప్రకటించారు. అనంతబాబుపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.  ఈ నెల 19వ తేదీన సుబ్రమణ్యం తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చిన సమయంలో అదే సమయంలో అనంతబాబు అదే రోడ్డుపైకి వచ్చినట్టుగా ఎస్పీ  చెప్పారు.

also read:సుబ్రమణ్యం హత్య: జీజీహెచ్‌లో ఎమ్మెల్సీ అనంతబాబుకి వైద్య పరీక్షలు పూర్తి

రోడ్డుపై సుబ్రమణ్యాన్ని చూసిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారును ఆపి ఆయనను  పిలిచి మాట్లాడాడు. అంతేకాదు కారులో సుబ్రమణ్యాన్ని తీసుకెళ్లాడు. అయితే సుబ్రమణ్యంతో మద్యం తాగిన మిగిలిన మిత్రులు తమ ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్పీ వివరించారు. జన్మభూమి పార్క్ ఏరియాలో టిపిన్ తీసుకుని ఎమ్మెల్సీ నివాసం ఉండే శంకర్ టవర్స్  వైపు రాత్రి పదిన్నరకు వచ్చారని ఎస్పీ చెప్పారు.  తనకు  ఇవ్వాల్సిన రూ. 20 వేల విషఫయమై కూడా ఎమ్మెల్సీ సుబ్రమణ్యాన్ని ప్రశ్నించాడు. సుబ్రమణ్యం తన వివాహం సందర్భంగా ఎమ్మెల్సీ వద్ద కొంత డబ్బును తీసుకున్నాడని ఎస్పీ చెప్పారు. అయితే ఇందులో కొంత నగదును ఇచ్చాడు.  ఇంకా రూ. 20 వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఈ డబ్బును తాను తిరిగి ఇస్తానని కూడా సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి చెప్పాడని ఎస్పీ చెప్పారు.

ఈ విషయమై ఎమ్మెల్సీ, సుబ్రమణ్యం మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకొందన్నారు. నీ పద్దతి మార్చుకోవాలి, మద్యం తాగొద్దని కూడా ఎమ్మెల్సీ సుబ్రమణ్యాన్ని గట్టిగా మందలించాడు. కొట్టేందుకు కూడా ఎమ్మెల్సీ వెళ్లాడు.  అప్పటికే మద్యం తాగి ఉన్న సుబ్రమణ్యం కూడా ఎమ్మెల్సీ కి ఎదురు తిరిగాడు. దీంతో ఆగ్రహం పట్టలేక ఎమ్మెల్సీ గట్టిగా నెట్టడంతో సుబ్రమణ్యం కిందపడ్డాడని ఈ క్రమంలోనే ఆయన తలకు గాయమైందని ఎస్పీ తెలిపారు. తనను కొడతావా అంటూ సుబ్రమణ్యం మరోసారి ఎమ్మెల్సీపై దాడికి ప్రయత్నించడంతో ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి అతడిని నెట్టివేయడంతో మరోసారి తలకు గాయమైందన్నారు.  

సుబ్రమణ్యం తలకు గాయాలు కావడంతో  వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో తీసుకెళ్లాడని ఎస్పీ చెప్పారు. అయితే మార్గమధ్యంలోని చాలా ఆసుపత్రులు మూసి వేసి ఉన్నాయన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా అందుబాటులో లేరన్నారు. అయితే ఇదే సమయంలో వెక్కిళ్లు వస్తున్న సుబ్రమణ్యాన్ని నీళ్లు తాగాలని అనంతబాబు వాటర్ బాటిల్ ఇచ్చాడు.ఈ నీళ్లు తాగిన కొద్దిసేపటికే సుబ్రమణ్యం చనిపోయాడు.ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్సీ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని  భావించాడని ఎస్పీ చెప్పారు. గతంలో మద్యం తాగిన సమయంలో సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదాలు చేసిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్ చేశాడన్నారు.

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలంటే మృతుడి శరీరంపై గాయాలుండాలనే ఉద్దేశంతో డంపింగ్ యార్డు  సమీపంలో కర్రతో సుబ్రమణ్యంపై కొట్టాడన్నారు. అదే సమయంలో సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చారు. అమృత ఆసుపత్రికి రావాలని ఎమ్మెల్సీ  సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అయితే సుబ్రమణ్యం శరీరంపై ఉన్న గాయాలను బట్టి రోడ్డు ప్రమాదం కాదని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని నిలదీశారని ఎస్పీ చెప్పారు.

ఎమ్మెల్సీ వాంగ్మూలం, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టుగా ఎస్పీ రవీంద్రబాబు చెప్పారు. డీఐజీ ఎదుట రవీంద్రబాబు లొంగిపోయాడని ఆయన చెప్పారు.శ్వాస ఆగిపోవడంతోనే సుబ్రమణ్యం చనిపోయినట్టుగా ఎస్పీ చెప్పారు.  గొడవ విషయాన్ని దాచిపెట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఎస్పీ వివరించారు. సుబ్రమణ్యం తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా కూడా విచారణ చేస్తామని ఎస్పీ ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu