
తిరుపతి : Nagari constituencyలో తనను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ నేతలపై MLA Roja ఎదురుదాడికి దిగారు. అసంతృప్తి వర్గ నేతల ఆరోపణలను తిప్పి కొట్టడం, లేదా వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటి చర్యల జోలికి పోలేదు. తన మద్దతుదారులైన నేతలందరినీ వెంటబెట్టుకుని వెళ్లి ఎస్బీకి ఫిర్యాదు చేశారు.
ఆ విషయాన్ని మీడియకు బహిర్గతపరిచారు. ఈ ఫిర్యాదు విషయంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ‘నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక తరలిస్తుంటే అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల అటుCM Jagan కు, పార్టీకి అప్రతిష్ట ఎదురవుతోంది’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గంలో TDPని బలోపేతం చేసేందుకు ఈ చర్యలు ఉపకరిస్తున్నాయని ఆరోపించారు.
మరోవైపు ఇసుకకు సంబంధించిన శాఖా మంత్రిని Sand excavations, రవాణాను నియంత్రించే అధికార యంత్రాంగాన్ని అవమానించేలా వీరి అసత్య ప్రచారం ఉందని పేర్కొన్నారు. ఇలా, నేరుగా ప్రభుత్వానికి , జిల్లా మంత్రులకు కూడా ముడిపెట్టి ఫిర్యాదు ఇవ్వడంతో దాన్ని కాదనే పరిస్థితి పార్టీలో ఏ స్థాయిలోనూ లేకుండా పోతోంది. తద్వారా తన ప్రత్యర్థులను ఆమె వ్యూహాత్మకంగా ఇరుకున పడేశారన్న భావన పార్టీలో వర్గాల్లో నెలకొంటోంది. జిల్లాలోని కొందరు ముఖ్యనేతల అండతోనే అసమ్మతి నేతలు తమకు వ్యతిరేకంగా బహిరంగ కార్యకలాపాలకు దిగుతున్నారని రోజా వర్గం భావిస్తున్నట్టు సమాచారం.
అందుకే తమ ప్రత్యర్థి వర్గ చర్యలు మంత్రులను కించపరిచినట్టవుతోందని ఎస్పీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా అసమ్మతి నేతలకు సహకరించకుండా, మద్దతివ్వకుండా మంత్రులకే బంధనాలు వేశారన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. పనిలో పనిగా తన నియోజక వర్గంలో అసమ్మతి నేతల కార్యకలాపాలు పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయని, టీడీపీ బలపడేందుకు ఉపకరిస్తున్నాయని అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేయడంలో ఆమె సఫలీకృతురాలైనట్టు భావిస్తున్నారు.
మధ్యాహ్నం నుంచే రూ. 2,500 పింఛన్ పంపిణీ.. వాళ్లకు కొత్త ఏడాది అయిన మంచి ఆలోచనలు రావాలి : సీఎం జగన్
మరోవైపు సొంతపార్టీ నేతలు కొందరిని కోవర్టులంటూ ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. రోజా దూకుడు జిల్లా ముఖ్యనేతలను సైతం కలవరపరిచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజా తనదైన శైలిలో దూకుడుగా వేసిన ఈ అడుగుతో నగరిలో వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా మరింత జోరందుకుంటుందా అనేది వేచి చూడాలి.
అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలు చేపట్టండి..
టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ జిల్లాకు చెందిన మంత్రుల మీద, తనదైన సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు చేపట్టాలని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆమె చిత్తూరులో ఎస్పీ సెంథిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ... జగనన్న కాలనీల్లో పేదల ఇళ్లు కట్టుకునే ప్రక్రియను ఆపడానికి వైసీపీలోని కొందరు కోవర్టులు టీడీపీతో చేతులు కలపడం దురదృష్టకరమన్నారు.
నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నగరిలోని రీచ్ నుంచి పేదల ఇళ్లకు ఇసుక తీసుకెల్తున్నారన్నారు. దీనిని రాజకీయం చేస్తూ, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం, వీడియో తీసి క్లిప్పింగులు పెట్టడం వంటి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. ఇది జిల్లా మంత్రితో పాటు అధికారులను కించపరచడమేనన్నారు.
వైసీపీకి చెందినవారైతే గనుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేవారని, అలా చేయడం వల్ల నిజానిజాలు తేలేవని పేర్కొన్నారు. డీజీపీని కలిసిన ఫోటోనూ తమ అసత్య ప్రచారాలకు పావుగా వాడుకొన్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని డీపీజీకి వివరించామని, ఆయన సూచనల మేరకే ఇలాంటి కార్యక్రమాలకు పుల్ స్టాప్ పెట్టేలా సంబంధితుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్పీని కోరామన్నారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఆమె వెంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.