ఉమ్మడి నెల్లూరులో వైసీపీలో మరో వికెట్ డౌన్?.. అనుచరులకు సంకేతాలు ఇచ్చిన ఎమ్మెల్యే..!!

Published : Mar 27, 2023, 02:50 PM ISTUpdated : Mar 28, 2023, 10:53 AM IST
ఉమ్మడి నెల్లూరులో వైసీపీలో మరో వికెట్ డౌన్?.. అనుచరులకు సంకేతాలు ఇచ్చిన ఎమ్మెల్యే..!!

సారాంశం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయం వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. అయితే తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా వైసీపీని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.  

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కోటాలో ఒకటి, పట్టభద్రుల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో.. అధికార వైసీపీకి షాక్ తగిలింది. అయితే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని  ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం వారిని సస్పెండ్ కూడా చేసింది. ఆ నలుగురిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు. వీరిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా వైసీపీకి వ్యతిరేకంగా వాయిస్‌ వినిపిస్తుండగా.. ఆ జాబితాలో తాజాగా మరో ఇద్దరు కూడా చేరినట్టయింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు వైసీపీలో మరింత మంది అసంతృప్తులు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో మరో వికెట్ డౌన్ కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన వారిలో ముగ్గురు(ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి) ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినవారే కాగా.. మరో ఎమ్మెల్యే కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. 2012 నుంచి జగన్ వెంటే నడిచారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. ఉప ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనకు మంత్రి పదవి వస్తుందని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ మారతారనే గతంలో ప్రచారం జరగగా.. ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు. 

ఇదిలా ఉంటే.. మరోసారి ఆయన  పార్టీ మారనున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. పార్టీ మార్పుకు సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. తన అనుచరులతో కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవి అటుంచితే, తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరుల వద్ద వాపోయారు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ.. కనీస గౌరవం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేసినట్టుగా సమాచారం. టీడీపీ, బీజేపీలలో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నల్లపురెడ్డి  ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 10కి 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు వైసీపీకి అక్కడే వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కాగా.. మరో ఎమ్మెల్యే అదే బాటలో నడిస్తే వైసీపీకి భారీ షాకే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?