మూడు రోజుల క్రితం ఓ డిగ్రీ విద్యార్థిని కనిపించకుండా పోయింది. ఆమె మూడు రోజుల తరువాత చెరువులో విగతజీవిగా లభించింది. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో పోలీసులు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ జిల్లా : మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బద్వేలు నియోజకవర్గం బి.కోడూరు మండలంలోని మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి అనూష (20) బద్వేలులోని శ్రీ చైతన్య కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె మూడు రోజుల క్రితం అదృశ్యం అయినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. దీనిమీద పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలోని జంగాపల్లి గ్రామం పెన్నానది ఒడ్డున ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది.
మృతి చెందడానికి గల కారణాలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో పోస్టుమార్టం చేయించారు. ఆ తరువాత మృతదేహాన్ని బాధిత కుటుంబీకులకు అప్పజెప్పారు. బి కోడూరు మండలం మరాఠీ పల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
undefined
బద్వేలులో కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యం.. విజయవాడలో గుర్తించిన పోలీసులు..
చిన్న కుమార్తె అనూష. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని.. కూలి పనులు చేస్తూ చదివించేవారు. కనిపించకుండా పోయిన కూతురు తిరిగి వస్తుందని రేయింబవళ్లు పోలీస్ స్టేషన్ల వద్ద, పరిసరాల ప్రాంతాల్లో ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. దీంతో వారు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. ఏఎస్ఐ సాయిలు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్ లో సినిమాకు వచ్చాడు. సినిమా చూస్తుండగా శైలజ వాష్ రూమ్ రూంకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ తిరిగి రాలేదు.
దీంతో కంగారు పడిన భర్త బైటికి వచ్చి వెతికాడు. మహిళా సిబ్బందితో వాష్ రూంలో కూడా వెతికించాడు. కానీ భార్య జాడ తెలియలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శైలజతో గత మే నెలలోనే భాస్కర్ రెడ్డికి వివాహం జరిగింది. తన భార్య దగ్గర సెల్ ఫోన్ కూడా లేదని, జాడ తెలియడం లేదని ఆదివారం ఆమె భర్త గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబి మాల్ లోని సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.