మిర్చి రైతు పరిస్ధితి మరీ ఘోరం

First Published May 15, 2017, 6:27 AM IST
Highlights

రైతుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని కూడా ఆళ్ళ డిమాండ్ చేసారు.

రాష్ట్రంలోని మిర్చి రైతు పరిస్ధితి దయనీయంగా తయారైందని వైసీపీ అంటోంది. వైసీపీ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి‘ఏషియానెట్’తో మాట్లాడుతూ, క్వింటాల్ మిర్చికి రైతుకు కనీసం వెయ్యి రూపాయలు కూడా దక్కటం లేదని ఆరోపించారు. కేంద్రంప్రభుత్వం ప్రకటించిన రూ. 6500 ఇప్పించటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. క్వింటాల్ కు రూ. 5వేలతో పాటు రూ. 1500 హ్యండ్లింగ్ ఛార్జిలను ఇప్పిస్తామని కేంద్రం చేసిన ప్రకటనకు రాష్ట్రంలో జరుగుతున్నదానికి అసలు సంబంధమే లేదని వాపోయారు.

దళారీలదే రాజ్యమైపోయిందని, వారు చెప్పినట్లే ప్రభుత్వ అధికారులు కూడా నడుచుకుంటున్నట్లు ఆళ్ళ మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు రాక, పండినపంటను నిల్వ చేసుకోలేక రైతుల అవస్తలు వర్ణనాతీతంగా మారిందని ఎంఎల్ఏ వాపోయారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా గతంలోనే రూ. 5 వేల కోట్ల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఉంటే కష్టకాలంలో రైతులకు ఎంతో ఉపయోగపడేదన్నారు.

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రుల వైఫల్యం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు మండిపడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. ప్రతీ విషయాన్ని గుడ్డిగా అధికారులపైన వదిలేయకుండా ప్రజల నుండి కూడా సమాచారాన్ని తెప్పించుకుంటేనే వాస్తవాలేమిటో మంత్రికి అర్ధమవుతుందని ఎద్దేవా చేసారు. రైతుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని కూడా ఆళ్ళ డిమాండ్ చేసారు.

 

click me!