రాయపాటి, మురళీ మోహన్ ఆశలపై నీళ్ళు

First Published May 15, 2017, 3:41 AM IST
Highlights

ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా రెండో వారితో సమస్యే. అందులోనూ పార్టీలో పరిప్ధితి కూడా ఏమంత బావోలేదు కదా? అందుకుని చంద్రబాబు భలే ఎత్తు వేసారు. అసలు ప్రజాప్రతినిధులకు నామినేటెడ్ పోస్టులే ఇచ్చేది లేదని తేల్చేసారు.

ఒత్తిడి నుండి బయటపడేందుకు చంద్రబాబునాయుడు భలే ఎత్తు వేసారు. టిటిడి పాలకమండలి ఛైర్మన్ కోసం పార్టీలో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లున్నప్పటికీ టిటిడి ఛైర్మన్ పోస్టంటే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుంది కొందరి పరిస్ధితి. ఛైర్మన కోసం నరసరావుపేట ఎంపి రాయపాటి  సాంబశివరావు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్ ఇద్దరు బాగా పోటీ పడుతున్నారు. తమకున్న మార్గాల్లో ప్రతీరోజు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. దాంతో చంద్రబాబుకు ఏం చేయాలో తోచలేదు.

ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా రెండో వారితో సమస్యే. అందులోనూ పార్టీలో పరిప్ధితి కూడా ఏమంత బావోలేదు కదా? అందుకుని చంద్రబాబు భలే ఎత్తు వేసారు. అసలు ప్రజాప్రతినిధులకు నామినేటెడ్ పోస్టులే ఇచ్చేది లేదని తేల్చేసారు. ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదన్నది పార్టీ విధానమంటూ కొత్త రాగం అందుకున్నారు. మళ్ళీ ఈ విధానం పార్టీ పదవులకు వర్తించదట.

ప్రజా ప్రతినిధులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకూడదన్న పార్టీ నిబంధన ఉన్నట్లు గతంలో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావించలేదు. ఎందుకంటే, మొన్ననే కాలపరిమితి ముగిసిన టిటిడి ట్రస్ట్ బోర్డులో కూడా సభ్యులుగా పలువురు ఎంఎల్ఏలున్నారు. అప్పుడు లేని విధానం ఇప్పుడే, హటాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చింది? అంటే, ఒత్తిడి తట్టుకోలేకే పార్టీ విధానం అంటూ చంద్రబాబు కొత్తరాగం అందుకున్నట్లు సమాచారం.

చంద్రబాబు తెరపైకి తెచ్చిన కొత్త విధానంతో రాయపాటి, మురళీమోహన్ లాంటి అనేక మంది ప్రజా ప్రతినిధుల నుండి నామినేటెడ్ పోస్టుల కోసం ఒత్తిళ్ళు ఆగిపోతాయ్. మళ్ళీ ఇక్కడో చిన్న మెలిక కూడా పెట్టారండోయ్ చంద్రన్న. తప్పని సరైతే, కొన్ని కీలక సందర్భాల్లో, నేతల మధ్య  రాజీ సమయంలో  మాత్రం ప్రజా ప్రతినిధులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే విషయంలో మినహాయింపులుంటాయట. అంటే తాను పోస్టులు ఇవ్వదలచుకున్న వారికి మళ్ళీ ఎటువంటి నిబంధనలూ అడ్డురాకుండా ముందుజాగ్రత్త పడ్డారన్న మాట.

click me!