
Nagendra Babu: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరుగుతుందని, అద్భుతం జరుగుతున్న సమయంలో అందరూ సహకరించాలని జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబు అన్నారు. తాను పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా రెడీ అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర జాతికే ప్రమాదకరం అని అన్నారు. కరోనా తర్వాత అత్యంత ప్రమాదకర వైరస్ వైసీపీ పార్టీనే అని తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. ఈ వైరస్‌కు విరుగుడు జనసేన, టీడీపీ పార్టీలేనని అన్నారు.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో నాగేంద్ర బాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో అద్భుతం జరుగుతుందని అన్నారు. ఆ సమయంలో అందరూ అందుకు సహకరించాలని వివరించారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ వయానాడ్ నుంచి అవుట్? సీటుపై సీపీఐ ఆసక్తి!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేపట్టి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కే చంద్రశేఖర్ రావునే తెలంగాణ ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని నాగేంద్రబాబు అన్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఏ అభివృద్ధి చేపట్టకున్నా ఎందుకు గెలిపిస్తారని, ఈ ఎన్నికల్లో వైసీపీ కూడా ఇంటికే అని జోస్యం చెప్పారు. అధికార, అహంకారం వైసీపీలో నిండా ఉన్నదని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని గద్దె దించాల్సిందేనని పిలుపు ఇచ్చారు.