
విజయవాడ : సినిమాల ప్రభావమో లేక సమాజం పోకడే కారణమో తెలీదుగానీ నేరాలు చేయడం కూడా హీరోయిజంగానే భావిస్తోంది నేటి యువత. చిన్నతనంలో బలపం పట్టాల్సిన చిన్నారులు కత్తిపట్టి నేరాలబాట పడుతున్నారు. ఇలా పెద్దల గొడవలో తలదూర్చి తండ్రితో గొడవపడుతున్నాడని తాత వరసయ్యే వ్యక్తిని చంపాడు ఓ మైనర్ బాలుడు. కత్తితో అత్యంత దారుణంగా నరికిచంపిన బాలుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామానికి చెందిన జంపాన జ్ఞానేశ్వర్(47) కౌలు రైతు. ఉయ్యూరు బైపాస్ రోడ్డులో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఇతడి బంధువొకరు కూడా ఈ భూమి పక్కనే మరో రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకున్నాడు. పక్కపక్కన ఒకే సరిహద్దు కలిగిన భూముల్లో వ్యవసాయం చేస్తున్న వీరిద్దరి మధ్య గతకొంత కాలంగా వివాదం సాగుతోంది.
తన తండ్రితో గొడవపడుతున్న జ్ఞానేశ్వర గౌడ్ పై పడమట నవీన్ కోపం పెంచుకున్నాడు. తాత వరసయ్యే అతడిని అంతమొందించాలని ఈ మైనర్ బాలుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. రోజూ పొలానికి వెళ్లే జ్ఞానేశ్వర్ గౌడ ను అక్కడే చంపాలని నవీన్ ప్లాన్ వేసాడు. ఇలా ముందుగానే కత్తితో పొలంవద్ద మాటువేసిన బాలుడు జ్ఞానేశ్వర్ గౌడ్ రాగానే దాడికి పాల్పడ్డాడు. కత్తితో విచక్షణారహితంగా నరకడంతో జ్ఞానేశ్వర అక్కడికక్కడే మృతిచెందాడు.
Read More నంద్యాల జిల్లాలో దారుణం.. నాల్గో తరగతి బాలిక కిడ్నాప్ యత్నం.. మత్తుమందిచ్చి, తాళ్లతో కట్టి...
రక్తపుమడుగులో పడిపోయిన జ్ఞానేశ్వర గౌడ్ చనిపోయినట్లు నిర్దారించుకున్నాకే నవీన్ అక్కడినుండి వెళ్లిపోయాడు. హత్యచేసిన కత్తితో సహా నేరుగా ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నవీన్ లొంగిపోయాడు. అతడినుండి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జ్ఞానేశ్వర్ గౌడ్ మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలుడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు జువైనల్ హోం కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.