మంత్రి వెల్లంపల్లికి కరోనా... సీఎం జగన్ ఆందోళన

By Arun Kumar PFirst Published Sep 28, 2020, 7:19 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. సామాన్య ప్రజలే కాదు వీఐపీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలను తాకిన ఈ వైరస్ సెగ తాజాగా దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను కూడా తాకింది. 

కరోనా లక్షణాలు కనిపించడంతో మంత్రి వెల్లంపల్లి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ఇటీవల తిరుమలలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే దగ్గరినుండి కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమం, చివరకు హైదరాబాద్ కు బయలుదేరేవరకు సీఎంతోనే వున్నారు మంత్రి వెల్లంపల్లి. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎం జగన్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 6,923 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కి చేరింది.

ఒక్క రోజే కోవిడ్ కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 5,708కి చేరుకుంది. ఈ ఒక్కరోజే 7,796 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,05,090కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 64,876 యాక్టివ్ కేసులున్నాయి.  శనివారం ఒక్కరోజే 76,416 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 56,00,202కి చేరుకుంది.

అనంతపురం 480, చిత్తూరు 577, తూర్పుగోదావరి 1,006, గుంటూరు 535, కడప 472, కృష్ణ 333, కర్నూలు 229, నెల్లూరు 506, ప్రకాశం 659, శ్రీకాకుళం 503, విశాఖపట్నం 318, విజయనగరం 376, పశ్చిమ గోదావరిలలో 929 కేసులు నమోదయ్యాయి.

అలాగే ప్రకాశం 8, కృష్ణ 6, గుంటూరు 5, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 4, అనంతపురం 3, కడప 3, కర్నూలు 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, చిత్తూరు 2, విజయనగరంలలో ఒక్కరు చొప్పున మరణించారు. 

click me!