ఆర్‌ఆండ్‌బి బాధ్యతలు స్వీకరించిన శంకర నారాయణ...తొలి సంతకం ఆ ఫైలుపైనే

By Arun Kumar PFirst Published Jul 29, 2020, 10:18 PM IST
Highlights

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు.
 

అమరావతి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్ లో రహాదారులు-భవనాల శాఖ కార్యాలయంలో కొత్త శాఖ బాధ్యతలను శంకర నారాయణ బుధవారం   స్వీకరించారు. అంతకు ముందు మంత్రి శంకర నారాయణ దంపతులకు పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత తనకు కేటాయించిన ఛాంబర్లో  సాంప్రదాయ పూజలు నిర్వహించారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం రూ.6400 కోట్లతో మూడు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డిబి(న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్) తో చేసుకున్న ఒప్పందం పై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేయనుంది ప్రభుత్వం. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వృద్ధ గౌతమి వంతెన నిర్మాణ పనులకు సంబంధించి రూ.76.90 కోట్ల పరిపాలన అనుమతులపై మంత్రి రెండో సంతకం చేశారు.

read more   ఏపీలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమదే: వైద్యారోగ్య శాఖ మంత్రి

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా వుందని అన్నారు. సిఎం జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ‌ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి సారిగా గెలిచిన తనకు గతంలో  బిసి సంక్షేమ శాఖ మంత్రిగా చేసే అవకాశం కల్పించినందకు ధన్యవాదాలు తెలిపారు.‌ 

రాష్ట్ర ప్రభుత్వంలో  కీలక మంత్రిత్వ శాఖలు‌ ఎస్సీ, ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి వైఎస్ఆర్ దగ్గర నుంచే నేటి జగన్మోహన్ రెడ్డి వరకు పేదలను ఆదరించి, అభివృద్ధి చేసే గుణం కలిగి ఉన్నవారని కొనియాడారు. తనపై నమ్మకం ఉంచి మంత్రిగా అవకాశం కల్పించారు కాబట్టి తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి సిఎం జగన్ కు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రహదారులు-భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి టి.కృష్ణబాబు, రాష్ట్ర గ్రామీణ రహదారుల చీఫ్ ఇంజనీరింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర రహదారులు-భవనాలశాఖ చీఫ్ ఇంజనీర్ నయీముల్లా, నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ రామచంద్ర, రాష్ట్ర రహదారులు- భవనాలశాఖ కార్పోరేషన్ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  

      

click me!