
చిత్తూరు : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లకు కూడా విద్యాదీవెన అందించాలని మంత్రి రోజా సెటైర్లు వేసారు. ఇంటర్ లో ఏ గ్రూప్ చదివాడో కూడా తెలియని వ్యక్తి పవన్ అయితే బైపిసి చదివి ఇంజనీర్ కావొచ్చని చెప్పేవ్యక్తి చంద్రబాబు అంటూ ఎద్దేవా చేసారు. ఇలా ఏం చదివారో, ఏం చదివితో ఏమవుతారో తెలియని ఇద్దరికీ విద్యాదీవెన అందించి చదువు చెప్పించాలని మంత్రి రోజా అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2023 ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికానికి సంబంధించిన విద్యాదీవెన డబ్బులను నేడు విడుదల చేసింది. చదువుకునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ పీజు రియింబర్స్ మెంట్ కు సంబంధించిన రూ.680 కోట్లు జమచేసారు. ఈ విద్యాదీవెన పథకం డబ్బుల విడుదల కార్యక్రమంలో మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో జరిగింది. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి 8,44,336 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు డబ్బులు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ... పేద, మద్యతరగతి విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బంది పడకూడదనే గొప్ప మనసు సీఎం జగన్ దని అన్నారు. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరి చెంతకు చేర్చాలన్న గొప్ప ఆలోచనలోంచి పుట్టిందే విద్యాదీవెన పథకమని అన్నారు. కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా అందరికీ విద్య అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చూస్తున్నారని అన్నారు. చదువునే పేదవాడి ఆస్తిగా మారుస్తున్న గొప్ప నాయకుడు జగన్ అని మంత్రి రోజా కొనియాడారు.
Read More శవ రాజకీయాలు చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన..: దుర్మార్గుడు అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు..
మాజీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా సెటైర్లు వేసారు. పోలీస్ కేసులు ఎవరిపై అయితే ఎక్కువగా వుంటాయో వారికి టిడిపి అధికారంలోకి రాగానే అంత పెద్ద నామినేటెట్ పోస్ట్ ఇస్తానంటున్న లోకేష్ వ్యాఖ్యలపై రోజా స్పందించారు. ఇలాంటి టిడిపి మాటలు నమ్ముకుంటే యువత జైలుకు వెళతారని అన్నారు. ఇక పవన్ కల్యాణ్ లాంటి వారిని నమ్ముకుంటే రిలీజయ్యే సినిమాలకు వెళతారని అన్నారు. కానీ సీఎం జగన్ ను నమ్ముకుంటే మంచి చదువులు అబ్బుతుందని... తద్వారా గొప్ప కాలేజీలు, యూనివర్సిటలకు వెళతారని మంత్రి రోజా అన్నారు.
చివరకు చంద్రబాబు నియోజకవర్గంలోనూ ప్రతి ఇంటికి వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని రోజా అన్నారు. ప్రత్యర్థి నాయకుడి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ది చేస్తున్న గొప్ప నాయకుడు జగన్ అన్నారు. ప్రస్తుతం కుప్పం ప్రజలు కూడా జగన్ కు మద్దతిస్తున్నారని... ఈసారి చంద్రబాబు ఓటమి ఖాయమంటూ రోజా అన్నారు.
పవన్ కల్యాణ్ రీల్ హీరో అయితే వైఎస్ జగన్ రియల్ హీరో అని రోజా అన్నారు. కాబట్టి రీల్ హీరో కావాలో లేక రియల్ హీరో కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ, ప్రజలకు సంక్షేమ పలాలు అదిస్తూ సుపరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేసారు.