బాలకృష్ణ కామెంట్స్ తప్పు.. ఆ తీవ్రత తెలియదు.. అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి: మంత్రి రోజా

By Sumanth KanukulaFirst Published Jan 25, 2023, 1:39 PM IST
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ఎవరూ భయపడరని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సీఎం జగన్‌ను విమర్శించేందుకే లోకేష్ పాదయాత్ర అని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలు, టూరిజం అభివృద్ది చెందుతుందని మంత్రి  ఆర్కే రోజా అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ఎవరూ భయపడరని అన్నారు. సీఎం జగన్‌ను విమర్శించేందుకే లోకేష్ పాదయాత్ర అని మండిపడ్డారు. లోకేష్‌ది యువగళం కాదు.. టీడీపీకి సర్వమంగళం అని విమర్శించారు. లోకేష్ పాదయాత్రతో ఏదేదో జరిగిపోతుందని టీడీపీ భ్రమలో ఉందిన అన్నారు. లోకేష్ పాదయాత్ర మొదటి రోజే రియాలిటీ అర్థం అవుతుందని విమర్శించారు. లోకేష్ టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అన్ని విధాలుగా దెబ్బతిన్నదని విమర్శలు గుప్పించారు. లోకేష్ వార్డుమెంబర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని ఎద్దేవా చేశారు. 

టీడీపీని అధికారంలోకి తేవాలనేది  జనసేన అధినేత పవన్ తాపత్రయం అని విమర్శించారు. పవన్ కల్యాన్‌ పార్టీ  జనసేనా? లేక చంద్రసేననా? అర్థం కావడం లేదన్నారు.  పవన్ కల్యాణ్ పొత్తులపై రోజుకు ఒక మాట మాట్లాడి కన్ఫ్యూజ్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పడం శుభపరిణామం అని అన్నారు. తిరుపతి జిల్లాలో సినీ పరిశ్రమకు తమిళ సినీ పెద్దలు భూమి కోరినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన రోజా.. తిరుపతిలో కోలివుడ్‌కు భూములిస్తే స్వాగతిస్తామని అన్నారు. 

సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై కూడా మంత్రి రోజా స్పందించారు. బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని అన్నారు. ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. బాలకృష్ణ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఆలోచించాలని అన్నారు. ‘‘అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలు చాలా తప్పు. గతంలో కూడా కోటా శ్రీనివాసరావును నాగబాబు ఏ విధంగా దూషించారో మనం చూశాం. ఎన్టీఆర్ కొడుకు అయిన బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గురించి అలా మాట్లాడటం తప్పు. అదే ఎన్టీఆర్ గురించి మాట్లాడితే బాలకృష్ణ వాళ్లకు ఎంత బాధ ఉంటుందో.. అదే విధంగా అక్కినేని కుటుంబానికి  కూడా ఉంటుంది. నాగేశ్వరరావు కూడా ఎన్టీఆర్‌కు సమానమైన హీరో. అలాంటప్పుడు నాగేశ్వరరావును అంటే వాళ్ల ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో కూడా ఆలోచించి మాట్లాడాలి. ఎంతపడితే అంతా మాట్లాడటం బాలకృష్ణ  ఎప్పుడు చేసే పనే అని.. ఎటువంటి పనిష్‌మెంట్ రాలేదు కాబట్టి దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియలేదు. అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి’’ అని రోజా అన్నారు. 

వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కుటుంబం తప్పుచేయలేదు కాబట్టే.. సీబీఐ విచారణకు వెళ్తామని చెప్పారని అన్నారు. సీబీఐని పక్కదారి పట్టించే విధంగా టీడీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వారి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల, పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల హత్య జరిగిందని.. అప్పుడు విచారణ చేసి ఎఫ్‌ఐఆర్‌లో అవినాష్ రెడ్డి పేరు చేర్చలేదన్నారు. ఇప్పుడు సీబీఐని తప్పుదారి పట్టిస్తూ హంగామా చేయటం తగదని రోజా అన్నారు. 
 

click me!