ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం చంద్రబాబుతో ఎలా కొట్లాడావో ప్రజలు ఇంకా మరచిపోలేదని మంత్రి అన్నారు. దగ్గుబాటి పురందేశ్వరికి పదవులు, డబ్బుపై ఆశ తప్ప మరే ఆలోచన లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి ఒక జగత్ కిలాడీ అని.. జగన్‌పై కక్ష సాధింపు ధోరణితోనే కేసులు రీ ఓపెన్ చేయాలని ఆమె సుప్రీంకోర్టుకు లేఖ రాశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పని నువ్వు చేసుకుంటే చాలని.. తనపై పెట్టిన అక్రమ కేసులను త్వరగా విచారించాలని జగనే పిటిషన్ వేసుకున్నారని రోజా చురకలంటించారు.
వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వస్తున్న చంద్రబాబుపై విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయాలని.. నీకో నియోజకవర్గం లేదని, నీకు ఓటేసే వాళ్లు ఎవరూ లేరంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుమార్తె అనే కార్డు వాడుతూ.. పార్టీలు మారుతూ అన్ని చోట్లా పదవులు అనుభవిస్తున్నావంటూ పురందేశ్వరిపై మండిపడ్డారు.
ఎన్టీఆర్ బతికుండగా ఓ కూతురిగా చేయాల్సిన సేవలు ఏవి చేయలేదని.. కానీ ఆయనకు వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబును మించిన కిలాడీవని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం చంద్రబాబుతో ఎలా కొట్లాడావో ప్రజలు ఇంకా మరచిపోలేదని మంత్రి అన్నారు. నిజంగా ఇలాంటి కూతురు పుట్టినందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారని .. ఏ తండ్రికి కూడా ఇలాంటి నీతిమాలిన కూతురు పుట్టకూడదని రోజా వ్యాఖ్యానించారు. దగ్గుబాటి పురందేశ్వరికి పదవులు, డబ్బుపై ఆశ తప్ప మరే ఆలోచన లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.