విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దుర్ఘటనలో బాధ్యులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) చర్యలు చేపట్టింది. బస్సు డ్రైవర్ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణియించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దుర్ఘటనలో బాధ్యులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) చర్యలు చేపట్టింది. బస్సు డ్రైవర్ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణియించింది. ఇప్పటికే ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యానికి అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. డ్రైవర్ ప్రకాశం రాంగ్ గేర్ వేయడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని కమిటీ పేర్కొంది. దీంతో ప్రకాశాన్ని సస్పెండ్ చేశారు.
ఇక విధుల పర్యవేక్షణలో విఫలమైన ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ వీవీ లక్ష్మీని కూడా అధికారులు సస్పెండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ గేర్ సిస్టం వున్న బస్సుకు పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న డ్రైవర్‌ను పంపకుండా.. సూపర్ల లగ్జరీ బస్సు నడిపిన ప్రకాశాన్ని విధులకు పంపారని కమిటీ నిర్ధారించింది. అటు ఈ మొత్తం వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్‌పైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది.
Also Read: విజయవాడ బస్ యాక్సిడెంట్ కు కారణమదే... ఆర్టిసి ఎండీ చేతికి నివేదిక
ఇక విజయవాడ బస్ యాక్సిడెంట్ మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆర్టిసి అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ఆర్టిసి ఎండి ద్వారకాతిరుమలరావు ఓ బృందాన్ని విచారణకోసం ఏర్పాటుచేసారు. టెక్నికల్ విషయాలు, ప్రత్యక్ష సాక్షులు, డ్రైవర్ నుండి వివరాలు సేకరించిన ఈ బృందం నివేదికను తయారుచేసి ఎండీకి అప్పగించింది.
ప్రమాదం జరిగిందిలా :
విజయవాడ నుండి గుంటూరు వెళ్ళేందుకు ఓ లగ్జరీ బస్సు డిపొ నుండి నెహ్రూ బస్టాండ్ కు చేరుకుంది. ప్లాట్ ఫారం పై నిలిపిన బస్సును డ్రైవర్ వెనక్కి తీయబోయాడు. ఇందుకోసం రివర్స్ గేర్ వేయకుండా ముందుకు వెళ్లే గేర్ వేసి ఒక్కసారిగా రేస్ చేసాడు. ఇంకేముందు బస్సు అమాంతం ముందుకు దూసుకెళ్లింది. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు ముగ్గురి ప్రాణాలను బలితీసుకోవడమే కాదు మరికొందరిని గాయాలపాలు చేసింది. ఈ ప్రమాదంలో ఓ కండక్టర్, మహిళా ప్రయాణికురాలితో పాటు చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.