జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు వైసీపీ నేత, మంత్రి ఆర్కే రోజా . 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు వున్నారని రోజా చురకలంటించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను జనసేన, టీడీపీ తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ నేత, మంత్రి ఆర్కే రోజా స్పందించారు. తిరుపతిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. పవన్ పార్టీ ఎందుకు పెట్టారు.. పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 24 సీట్లకే పవన్ తల ఎందుకు ఊపారు... ఏ ప్యాకేజీ కోసం తలవంచారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. పవర్ స్టార్ .. పవర్ లేని స్టార్ అయ్యారని , ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని పరిస్ధితి నెలకొందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలో కూడా తెలియని గందరగోళంలో వున్నారని రోజా దుయ్యబట్టారు.
పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అన్నారని .. పావలా షేర్ సీట్లు కూడా తెచ్చుకోలేదని కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లుగా జనసేన నేతలు వున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదా , కమీషన్ కోసం పోలవరం , రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని, ఓటుకు నోటు కేసులో ఉమ్మడి రాజధానిని చంద్రబాబు తాకట్టు పెట్టారని రోజా ఘాటు విమర్శలు చేశారు. పవన్ రాజకీయాలకు పనికి రాడని తాను ఎన్నోసార్లు చెప్పానని ఆమె దుయ్యబట్టారు.
పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థంకావటం లేదన్నారు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచవో జనసైనికులకు చెప్పాలని.. 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు వున్నారని రోజా చురకలంటించారు. జగనన్నను ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని.. వాళ్లలో వాళ్లకే గందరగోళం, ఈ పరిస్ధితిలో 118 స్థానాలు ప్రకటించారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ స్థానాలు కూడా ప్రకటించారు కానీ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పలేదన్నారు. 1 స్థానంలో ఒడిపోయిన వారికి మొదటి జాబితాలో, 2 స్థానాల్లో ఒడిపోయినవారికి రెండవ జాబితాలో పేరు ఇస్తారేమో పవన్ తెలుసుకోవాలన్నారు.