టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా .. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారనుకోలేదు : బూరగడ్డ వేదవ్యాస్

పెడన తెలుగుదేశం పార్టీ టికెట్‌ను కాగిత కృష్ణప్రసాద్‌కు ప్రకటించారు చంద్రబాబు.. అయితే తనకు సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారని అనుకోలేదని.. 2019లో చంద్రబాబు మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను శనివారం ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు విడుదల చేశారు. అయితే టికెట్ దక్కని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెడన టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. పెడన తెలుగుదేశం పార్టీ టికెట్‌ను కాగిత కృష్ణప్రసాద్‌కు ప్రకటించారు చంద్రబాబు.. అయితే తనకు సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు వేదవ్యాస్.. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పెడన టికెట్ తనకే వస్తుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్రమనోవేదనకు గురయ్యారు వేదవ్యాస్. శనివారం కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు వేదవ్యాస్‌ను ఆసుపత్రికి తరలించారు. 

Latest Videos

అంతకుముందు కార్యకర్తల సమావేశంలో వేదవ్యాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారని అనుకోలేదని.. 2019లో చంద్రబాబు మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి న్యాయం జరుగుతుందనుకున్నానని.. కానీ తనకు అన్యాయమే జరిగిందన్నారు. చంద్రబాబు , పవన్‌ను కలుస్తానని...తనకు జరిగిన అన్యాయంపై నిలదీస్తానని వేదవ్యాస్ పేర్కొన్నారు. టీడీపీ , జనసేన కార్యకర్తల మద్దతు తనకే ఉందని .. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని గెలిచే సత్తా వుందని ఆయన తెలిపారు. 

మరోవైపు .. జనసేనకు షాకిచ్చారు పెడన జనసేన పార్టీ నేతలు. పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన టిక్కెట్ జనసేనకు ఇస్తారని ఆశపడ్డామని.. బూరగడ్డ వేదవ్యాస్‌ను ఉమ్మడి అభ్యర్ధిగా  ప్రకటిస్తారనుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని మోసం చేశారని.. అన్యాయం జరిగిన చోట తాము వుండలేమని వారు తేల్చిచెప్పారు. ఆ వెంటనే జనసేన పార్టీకి కృత్తివెన్ను, గూడూరు, పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు రాజీనామా చేశారు. 

click me!