
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హాయ్ ఏపీ.. బైబై వైసీపీ అనేది తమ నినాదమంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. హాయ్ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్) అనే నినాదాన్ని జనం ఎత్తుకుంటారని రోజా పేర్కొన్నారు. పవన్ పార్టీకి జిల్లాల అధ్యక్షులు లేరని, 175 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆయనకు అభ్యర్ధులు లేరని మంత్రి చురకలంటించారు. అలాంటి పవన్ కల్యాణ్.. సీఎం జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమేస్తానని చెప్పడం విడ్డూరంగా వుందని రోజా దుయ్యబట్టారు.
ఒక రోజు సీఎం అవుతానని, మరో రోజు ఎమ్మెల్యే అవుతానని పవన్ అంటున్నారని.. కానీ జనానికి ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. వైసీపీ నేతలను కొడతానని చెప్పడానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారా అని ఆర్కే రోజా ప్రశ్నించారు. జగన్‌ను కాదని జనం పవన్ కళ్యాణ్‌కు ఎందుకు ఓటేయ్యాలని మంత్రి నిలదీశారు. స్లోగన్లు, మేనిఫెస్టోలు అన్నింటినీ చంద్రబాబు కాపీ కొడుతున్నారని రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు , పవన్ కల్యాణ్ విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా వైసీపీకి భయం లేదన్నారు.
ALso Read: బట్టలూడదీసి కొడతాడంట.. తేరగా వున్నాం, రమ్మనండి : పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు ఆగ్రహం
అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడితూ.. వారాహిపై పవన్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్నాడని, బట్టలూడదీసి కొడతానని అంటున్నారని.. కొట్టించుకోవడానికి మేం తెరగా వున్నామా అంటూ అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు పరిపక్వత లేదని, అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే సినిమా షూటింగ్‌లు అనుకునే పరిస్ధితిలో పవన్ వున్నారని రాంబాబు సెటైర్లు వేశారు.