హెలిప్యాడ్ భూమి కోటయ్యదని నిరూపించండి: జగన్‌కు పత్తిపాటి సవాల్

By Siva KodatiFirst Published Feb 20, 2019, 12:04 PM IST
Highlights

కొండవీడులో రైతు కోటయ్య మృతిపై ఫోరెన్సీక్ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. కోటయ్య మరణం నిజానిజాలు తెలుసుకునేందుకు మంత్రి ప్రతిపాటి బుధవారం కొండవీడులో పర్యటించారు. 

కొండవీడులో రైతు కోటయ్య మృతిపై ఫోరెన్సీక్ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. కోటయ్య మరణం నిజానిజాలు తెలుసుకునేందుకు మంత్రి ప్రతిపాటి బుధవారం కొండవీడులో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోటయ్య మరణంపై ముఖ్యమంత్రి దర్యాప్తుకు ఆదేశించారన్నారు. ఈ ఘటనపై వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ, సాక్షి పత్రిక విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కోటయ్య కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే కాపాడేందుకు ఎంతగానో శ్రమించారని, భుజాల మీద వేసుకుని ఒక కాంట్రాక్టర్‌కి చెందిన కారులో ఫిరంగిపురం ఆసుపత్రికి తరలించారని చెప్పారు.

ఎంతో శ్రమకోర్చి... రైతును కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులపై బురద చల్లారని పుల్లారావు మండిపడ్డారు. హెలిప్యాడ్ నిర్మాణం జరిగిన భూమి కోటయ్యదేనని జగన్ నిరూపిస్తే...తాను మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి సవాల్ విసిరారు.

ఒకవేళ జగన్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. కోటయ్య మరణాన్ని సాకుగా తీసుకుని రాష్ట్రంలో హింసను లేవదీయాలని ప్రతిపక్షనేత ప్రయత్నిస్తున్నారని ప్రత్తిపాటి ఆరోపించారు.

రైతు భూమి హెలికాఫ్టర్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఆయన భూమిలో పోలీసులెవరు అడుగు పెట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కోటయ్య కుమారుడిని ఘటనాస్థలంలో పోలీసులు అడ్డుకోలేదన్నారు.

తండ్రి అంత్యక్రియలు జరక్కుండానే... ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ఏం చేశారో రాష్ట్రం మొత్తానికి తెలుసునన్నారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు రాయడంతో పాటు కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టేందుకు సాక్షి పత్రిక ప్రయత్నిస్తోందని పుల్లారావు ఆరోపించారు. కొండవీటి కోట అభివృద్ధిని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.
 

click me!