గూండాలతో, గన్‌లతో ..పక్కా స్కెచ్‌తో పుంగనూరుకి .. అన్నింటికీ చంద్రబాబే ముద్దాయి : పెద్దిరెడ్డి

Siva Kodati |  
Published : Aug 04, 2023, 09:02 PM IST
గూండాలతో, గన్‌లతో ..పక్కా స్కెచ్‌తో పుంగనూరుకి .. అన్నింటికీ చంద్రబాబే ముద్దాయి : పెద్దిరెడ్డి

సారాంశం

అంగళ్లు, పుంగనూరులలో ఇవాళ జరిగిన హింసాత్మక ఘటనలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారకుడన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ వయసులో చంద్రబాబు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయిస్తాడని ఎవరూ అనుకోరన్నారు.

అంగళ్లు , పుంగనూరులో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం, పక్కా స్కెచ్ తో తన పార్టీ కార్యకర్తలు , నాయకులతో దాడులు చేయించాడని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందే ప్లాన్ చేసుకున్నట్లుగానే ఈ ఘటనకు కారణమయ్యాడని పేర్కొన్నారు. నిన్న రాత్రి 10.30 గంటలకు టీడీపీ నేతలు పుంగనూరు పట్టణానికి చంద్రబాబు రావడం లేదని.. బైపాస్‌ మీదుగా వెళ్తున్నామని సమాచారం అందించారని చెప్పారని పెద్దిరెడ్డి తెలిపారు. చివరికి పోలీసులకు కూడా పుంగనూరుకు రావడంలేదనే చెప్పారని మంత్రి పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు చంద్రబాబు పాలనలో తమకు జరిగిన అన్యాయం పట్ల నిరసన కార్యక్రమం పెట్టుకుని ఆయన కోసం ఉదయం 10.30 వరకు ఎదురుచూశారని పెద్దిరెడ్డి తెలిపారు. కానీ ఆయన ఇటువైపు రావడంలేదని తెలిసి వారంతా వెళ్లిపోయారని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత చంద్రబాబు పనిగట్టుకుని రెచ్చగొట్టడానికి పుంగనూరుకు వచ్చారని పెద్దిరెడ్డి ఆరోపించారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకూడదని పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారని మంత్రి తెలిపారు. 

Also Read: అంగళ్లులో రాళ్ల దాడి టీడీపీ పనే.. నిగ్రహంతో వున్నాం, అందుకే తిరుగుతున్నారు : సజ్జల వ్యాఖ్యలు

కావాలనే పనిగట్టుకుని ఆలస్యంగా పుంగనూరు వైపు వచ్చి ప్రజలను చంద్రబాబు రెచ్చగొట్టారని పెద్దిరెడ్డి ఆరోపించారు. పోలీసులు కూడా సమాచారం లేకుండా ఎలా వస్తారని అడిగినందుకు వాళ్లను రక్తాలు కారేటట్టు కొట్టారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్ని కర్రలతో, రాడ్లతో కొట్టారని.. వారి జీపులు, వాహనాలను కూడా టీడీపీ నేతలు ధ్వంసం చేసి తగులబెట్టారని మంత్రి చెప్పారు. పుంగనూరు, అంగళ్లులో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. కిరాయి గుండాల్ని తెచ్చుకుని, కార్లలో గన్‌లను పెట్టుకుని వచ్చారని.. ఆ గన్‌లున్న కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంత్రి చెప్పారు. 
 
ఇలా జరుగుతుందని తెలిసుంటే పుంగనూరు, అంగళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండేవారని పెద్దిరెడ్డి తెలిపారు. కానీ, మేం పుంగనూరుకు రావడంలేదని చెప్పి ప్రజలను తప్పుదారిపట్టించి మరలా ప్లాన్‌ ప్రకారం చంద్రబాబు ఇటు వచ్చారని రామచంద్రారెడ్డి ఆరోపించారు. పుంగనూరు పుడింగా.. నీ తాత జాగీరా..? అని నన్ను ఏ మాటంటే ఆ మాట అన్నాడని ఈ వ్యాఖ్యలను చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు పెద్ద శాంతి కాముకుడని చెప్పుకోవడం కాదని ఇలాంటి ఘటనల్ని రెచ్చగొట్టి చేయించిన వారిని ఏమనాలి అని మంత్రి ప్రశ్నించారు. ఈరోజు ఆయన ప్రదర్శించిన రౌడీయిజంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని పెద్దిరెడ్డి నిలదీశారు.

Also Read: ఇవాళ్టీ విధ్వంసానికి కారణం పెద్దిరెడ్డే .. ఆయనేమైనా పెద్ద పుడింగా, వైనాట్ పుంగనూరు : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబు దిగజారి వీధిరౌడీలా మాట్లాడటం అలవాటేనని.. అతని ప్రవర్తనను ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు చూశారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఆయనకు మతిస్థిమితం లేదని, విపరీతమైన ఫ్రస్టేషన్‌తో ఊగిపోతూ శాంతిభద్రతల సమస్యల్ని సృష్టిస్తున్నాడని రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వయసులో చంద్రబాబు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయిస్తాడని ఎవరూ అనుకోరన్నారు.

సీనియర్‌ రాజకీయవేత్తనని చెప్పుకుంటూ నోటికి పలకరాని భాష మాట్లాడుతూ మమ్మల్ని బూతులు తిట్టాల్సిన పనేంటి అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఇంత హింసాత్మక ఘటనలకు ఉసిగొల్పుతాడని అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆయనను తిరగనిచ్చేవారు కాదన్నారు. ఈరోజు ఘటనలకు పూర్తిగా చంద్రబాబునే కారకుడు కనుక.. ఈ దాడి కేసుల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

No Petrol Shortage in AP:రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు విజయవాడ జాయింట్ కలెక్టర్| Asianet News Telugu
సచిన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన ఆంధ్ర యూనివర్సిటీ | Andhra University Centenary Celebrations